అంతర్జాతీయ క్రికెట్‌కు
వీవీఎస్ లక్ష్మణ్ గుడ్ బైన్యూఢిల్లీ, ఆగస్టు 18 (జనంసాక్షి):
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తక్షణమే తప్పుకుంటున్నట్లు హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వివియస్ లక్షణ్ ప్రకటించారు. శనివారం నాడు ఆయన హెచ్‌సిఎ కార్యాలయంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత నాలుగైదు రోజులుగా అంతర్మధ నానికి లోనైన లక్ష్మణ్ ఏట్టకేలకు నేడు తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. ”మరికొంత కాలం క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉన్నా రిటైర్మెంట్‌కు ఇదే మంచి సమయమని భావించా. ఇది నాకు కఠిన నిర్ణయమేనని” లక్ష్మణ్ ఎంతో ఉద్వేగంగా చెప్పారు. దీంతో ఆయన హైదరాబాదులో న్యూజిలాండ్‌తో ఈనెల 23వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో కూడా ఆడబోనని ఆయన చెప్పకనే చెప్పేశారు. క్రికెట్ ద్వారా దేశప్రతిష్టను పెంచడానికి శాయశక్తులా కృషి చేశానని ఆయన చెప్పారు. వ్యక్తిగత విజయాలకన్నా, జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చానని అన్నారు. క్రికెట్‌కు 16ఏళ్ల పాటు సేవలు అందించానని, రిటైర్మెంట్‌కు ఇదే తగిన సమయమని భావిస్తున్నానని ఆయన అన్నారు. క్రికెట్‌ను దేశానికి సేవ చేయడానికి అవకాశంగా భావించినట్టు ఆయన తెలిపారు. క్రికెట్ ద్వారా దేశ గౌరవాన్ని పెంచేందుకు తాను కృషి చేశానని ఆయన అన్నారు. భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. జూనియర్లకు అడ్డుగా ఉండకూడదని, వారికి అవకాశం కల్పించాలని భావించి క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ యాత్రలో తనకు ఎంతోమంది సహకరించారన ఆయన చెప్పారు. క్రికెట్ సభ్యులతో గడిపిన క్షణాలు మరవలేనివని ఆయన అన్నారు. తన ప్రతిభను గుర్తించిన హెచ్‌సిఎకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రిటైర్మెంట్ ప్రకటించడం కఠిన నిర్ణయమే అని ఆయన అన్నారు. 17ఏళ్ల వయస్సులో క్రికెటర్ కావాలని అనిపించిందని ఆయన అన్నారు. తాను తప్పుకుంటున్నాననే విషయం సెలెక్టర్లకు ఈ ఉదయమే చెప్పినట్టు ఆయన తెలిపారు. నిర్ణయం ప్రకటించడానికి నాలుగైదు గంటల ముందు చాలా ఉద్వేగానికి గురైనట్టు ఆయన తెలిపారు. లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తనను ఇంతవాడ్ని చేశారని ఆయన చెప్పారు.
హైదరాబాద్ క్రికెటర్లకు తన అనుభవాన్ని పంచుతానని ఆయన చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్ క్రికెట్‌లో ఆడుతానని ఆయన చెప్పారు. వసీం అక్రమ్ బౌలింగ్‌ను ఆయన ప్రశంసించారు. సౌరవ్, ద్రావిడ్, సెహ్వాగ్, కుంబ్లే తనకు స్ఫూర్తినిచ్చారని ఆయన అన్నారు. వారంతా తనకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా రోల్ మోడల్స్ అని ఆయన అన్నారు.
తాను అసంతృప్తికి గురయ్యాననే విషయం నిజం కాదని ఆయన అన్నారు. హైదరాబాద్ మ్యాచ్‌లో ఆడలేకపోతున్నందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. తాను నమ్మినదానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొనే సదవకాశం తనకు దక్కిందని ఆయన అన్నారు. క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా తనది సరైన నిర్ణయమని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ క్రికెటర్లలో విశేష ప్రతిభ ఉందని ఆయన అన్నారు.