అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా పట్టివేత

అబ్దుల్లాపూర్మెట్, (జనం సాక్షి):
అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్‌ టీమ్ మహేశ్వరం జోన్ మరియు బ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించారు.

పోలీసులకు అందిన పక్కా సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద కంటైనర్‌ను ఆపి తనిఖీ చేయగా, దాని లోపల రాళ్ల ఆకారంలో ప్రత్యేకంగా మాదకద్రవ్యాలను దాచిపెట్టినట్లు గుర్తించారు. పైభాగంలో స్క్రాప్‌ మెటీరియల్‌ను ఉంచి మాదకద్రవ్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

ఈ దాడిలో రూ. 1.05 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ కేసుకు సంబంధించి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హాఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.