అందుబాటులో ఎరువులు, విత్తనాలు
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
సిద్దిపేట,మే30(జనంసాక్షి): వానకాలంలో రైతులు వేసే పంటలకు అవసరమగు విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. రైతులకు వర్షాధార పంటలకు అవసరమయ్యే వరి, మొక్కజొన్న, పత్తి, కందులు, పెసర్లు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వరి పంట వేసే వారికి వరి విత్తనాలు 7500 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని కిలోకు రూ.5 చొప్పున విత్తనాలు, మొక్కజొన్న 35శాతం సబ్సిడీతో 60 వేల క్వింటాళ్ల విత్తనాలు రైతులు వేసే కావేరి, సీబీ 81,82 అందుబాటులో ఉన్నాయన్నారు. కందులు 580 క్వింటాళ్లు, పెసర్లు 40 క్వింటాళ్లు అందుబాటులో ఉండగా 65 శాతం సబ్సిడీతో ప్రతి ఆగ్రోస్ సెంటర్‌లో విత్తనాలు లభిస్తాయన్నారు. అదే విధంగా పత్తి 2లక్షల ఎకరాల సాగు కోసం ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అందుకు పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించాలని చెప్పారు. రైతులు అందుబాటులో ఉన్న విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వెయ్యి ఎకరాలకు అవసరమగు చిరుధాన్యాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆరుతడి పంటలు పండించే సమయంలో రసాయన ఎరువులు వాడకంతో చీడ పీడలు చేరి పంటలు దెబ్బతింటాయని, దాంతో క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయని, అలాంటి సమయంలో పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలుగ వాడడంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఎరువులను ఆయా గ్రామాల్లోని సొసైటీ కేంద్రాల్లో అందుబాటులో ఉండే విధంగా చూడాలని, ప్రతి గ్రామంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై అవసరమైతే పీడీ యాక్టు కేసులు పెట్టాలని సూచించారు.