అకాల వర్షాలతో భారీగా పంట నష్టం 

అయినా బీమా సొమ్ముపై అపనమ్మకం
నిబంధనల ఉచ్చులో రైతుకు అందని సాయం
నిజామాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) :  జిల్లాలో ఈ ఖరీఫ్‌లో గత ఇరవై రోజులుగా కురిసిని వర్షాల కారణంగా పలు గ్రామాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 33 శాతానికంటే ఎక్కువ మొత్తంలో పంటలు దెబ్బతింటేనే నష్టపరి హారానికి సిఫార్సు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ సంవత్సరం కురుస్తున్న వర్షాల కారణంగా ఇరవై నుంచి ముప్ఫై శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నష్టం లెక్కల్లోకి రాదు. పంటనష్టం అంతకు మించి ఉంటేనే వ్యవసాయాధికారులు వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గత కొన్నేళ్లుగా బీమా చేస్తున్న జిల్లాలోని రైతులకు పరిహారం అందేది నామమాత్రం గానే ఉంటుంది. వేల సంఖ్యలో రైతుల పంట నష్టం జరిగినా, రైతులకు అందుతున్నది మాత్రం తక్కువగానే ఉంటుంది. ప్రతి యేడాది బీమా కంపెనీలు ఏడు నుంచి ఎని మిది కోట్ల రూపాయల వరకు మాత్రమే పంట నష్టాన్ని అందజేస్తున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం ఖరీఫ్‌లో 31,200 మంది రై తుల పంటలకు బీమా చేశారు. వారినుంచి రెండు శాతం పేరున 16.78 కోట్ల రూపాయలు వసూలు చేసి, వారు వేసిన పంటలకు బీమాను వర్తింపజేశారు. వర్షాలు కురియడం, పంట నష్టపోవడం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. బీమా నిబంధ నల ప్రకారం నష్టం 33 శాతం దాటితేనే పరిహారం వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా ఎక్కువ మొత్తంలో పంట నష్టం జరిగినందున పరిహారం వచ్చే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయాధి
కారులు మాత్రం పంట నష్టం వివరాల సేకరణ చేస్తున్నారు. జిల్లాలోని డిచ్పల్లి, నవీపేట్‌, ఆర్మూర్‌, మోర్తాడ్‌, ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లితోపాటు పలు మండలాల్లో పంటల పరిస్థితిని అధికారులు పరిశీలించి, నష్టం వివరాలను అంచనా వేస్తున్నారు. ఇప్పటికి నిబంధనల ప్రకారం ఐదొం దల హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. పంట నష్టపరిహారం కూ డా వ్యవసాయాధికారుల నివేదిక ఆధారంగా నే ప్రభుత్వం మంజూరుచేస్తుంది. ఇన్సూరెన్స్‌ ఉన్న రైతులకు మాత్రం ఇది వర్తించదు.  నివేదికలు కూడా వ్యవసాయాధికారులే ఇన్సూరెన్స్‌ కంపెనీకి పంపి, నష్టపరిహారం అందజేయాలని కోరుతారు. భారీ వర్షాలతో నష్టపోతే రుణాలు తీసుకున్నవారికి ఈ బీమాను అమలు చేశారు. బీమా ఆధారంగా ఐదేళ్లలో ఆ గ్రామ పరిధిలో వచ్చిన ఉత్పత్తి ఆధారంగా పంట నష్టాన్ని అంచనా వేస్తారు. దానికి అనుగుణంగానే బీమా కంపెనీలు నష్టపరిహారాన్ని అందజేస్తాయి. ఈ సంవత్సరం అనుకున్న రీతిలో రైతులు రుణాలు తీసుకోలేదు. బ్యాంకులు కూడా సగం లక్ష్యాన్నే పూర్తిచేశారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల ఉత్పత్తి ఆధారంగా ఎంత పంట నష్టం జరిగితే అంతే మొత్తాన్ని అందించనున్నారు. జిల్లాలో అకాల వర్షాలు భారీగా పంట న ష్టాన్ని కలిగించి, రైతుకు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. ఎండబోసిన వరి ధాన్యంతోపాటు మొక్కజొన్న తడిసి ముద్దయిపోతుంది. ఈ యేడు పంటలకు వ్యాధులు లేవని, పంటలు బాగా ఉన్నాయని భావించిన రైతులకు ఈ వానలు గట్టి షాకిస్తున్నాయి. జిల్లాలో వేలాది ఎకరాల వరిపంట వర్షాల కారణంగా నేలకొరిగి, భారీగా దెబ్బ తింది. కొన్ని ప్రాంతాల్లో కోసిన ధాన్యం సైతం తడిసిపోయింది. భారీగా ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేసి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా వర్షాల కారణంగా ఆ కేంద్రాలు ఖాళీగా ఉంటున్నాయి.