అక్కన్నపేట్‌`మెదక్‌ నూతన లైన్‌ సెక్షన్‌లో భద్రత తనిఖీలు నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌

14 సెప్టెంబర్‌, 2022

జనం సాక్షి ప్రతినిధి మెదక్

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ నేడు అనగా 14 సెప్టెంబర్‌ 2022 తేదీన హైదరాబాద్‌ డివిజన్‌లోని అక్కన్నపేట్‌`మెదక్‌ నూతన రైల్వే లైన్‌ సెక్షన్‌లో భద్రత తనిఖీలు చేపట్టారు. ఆయన వెంట హైదరాబాద్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ శ్రీ శరత్‌ చంద్రయాన్‌, దక్షిణ మధ్య రైల్వే సీఏఓ/కనస్ట్రక్షన్‌ శ్రీ నీరజ్‌ అగర్వాల్‌ మరియు ఇతర సీనియర్‌ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ సికింద్రాబాద్‌ నుండి మేడ్చల్‌ మరియు మనోహరాబాద్‌ స్టేషన్ల మీదుగా ప్రత్యేక రైలులో ప్రయాణించి తనిఖీలు ప్రారంభించారు. ఆయన అక్కన్నపేట్‌ రైల్వే స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు మరియు అక్కడ ఆయన ప్రయాణికుల సౌకర్యాలను మరియు స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయం, బుకింగ్‌ కార్యాలయంతో సహా స్టేషన్‌ ఆవరణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన నూతనంగా నిర్మించిన లక్ష్మాపూర్‌ మరియు శమ్నాపూర్‌ రైల్వే స్టేషన్ల మీదుగా మెదక్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను స్టేషన్‌ పరిసరాలను, స్టేషన్‌ ఆవరణ ప్రాంతాన్ని తనిఖీలలో భాగంగా పరిశీలించారు.
జనరల్‌ మేనేజర్‌ మెదక్‌ రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా తనిఖీ చేశారు. అక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వసతులను ఆయన సమీక్షించారు మరియు స్టేషన్‌లోని స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయాన్ని, అండర్‌ పాస్‌, స్టేషన్‌ ఆవరణను కూడా తనిఖీ చేశారు. అనంతరం, ఆయన తిరుగు ప్రయాణంలో మెదక్‌`అక్కన్నపేట్‌ సెక్షన్‌లో వంతెనలు, వంపులను మరియు ఇతర భద్రతా అంశాలను కూడా పరిశీలించారు.
తనిఖీలలో భాగంగా, జనరల్‌ మేనేజర్‌ స్టేషన్లలో అభివృద్ధి పనులకు మరియు అదనపు వసతులకు సబంధించి వివిధ ప్రజా ప్రతినిధుల నుండి పలు విజ్ఞప్తులను స్వీకరించారు. ఆయన మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడుతూ మరిన్ని సౌకర్యాల అభివృద్ధి కోసం రైల్వే చేపడుతున్న ప్రణాళికల గురించి వారికి క్లుప్తంగా తెలియజేశారు.