అక్బర్‌ యూట్యూబ్‌ వ్యాఖ్యలను తొలగించలేం

తెలుసుకోవడం పౌరుల హక్కు : హైకోర్టు
హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి):
యూట్యూబ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రసంగ దృశ్యాలను తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. మరొకరి భావ ప్రకటన స్వేచ్ఛలో తాము జోక్యం చేసుకోజాలమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్‌ కు అభ్యంతరాలుంటే, ప్రసంగ దృశ్యాలను తొలగిం చాలని నేరుగా న్యూయార్క్‌లోని యూట్యూబ్‌ కార్యాలయాన్ని ఆశ్రయించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. వాక్‌స్వాతంత్య్రంలో అక్బర్‌కు లేని ఇబ్బంది విూకేందుకని జస్టిస్‌ సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డిలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. సున్నితమైన ఈ అంశాన్ని చూసి సంతోషించే వారు, నిరసించే వారు, విని తెలుసుకొనే వారు ఉంటారని ధర్మాసనం పేర్కొంది. తెలుసుకోవడం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ      కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలనే యూట్యూబ్‌ వెబ్‌సైట్‌లో ఉంచిందని, అసలు యూట్యూబ్‌ అలాంటి దృశ్యాలను ప్రసారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించింది. ఇలాంటి వాటిలో తాము జోక్యం చేసుకోజాలమని తేల్చి చెప్పింది. దీంతో యూట్యూబ్‌లోని అక్బరుద్దీన్‌ ప్రసంగాన్ని పదే పదే ప్రసారం చేయకుండా ప్రసార మాధ్యమాలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ న్యాయవాది జేవీఎస్‌ రామారావు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.