అక్రమంగా డిస్మిస్ చేసిన 47 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. – ఎస్జికేఎస్ డిమాండ్.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 20, (జనంసాక్షి )
సింగరేణి యాజమాన్యం అకారణంగా డిస్మిస్ చేసిన 47 మంది సింగరేణి కార్మికులను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ అంబాల మహేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం గత ఆరు నెలల క్రితం అన్యాయంగా 47 మంది కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. ఈ ఘనత జాతీయ కార్మిక సంఘాలు మరియు ప్రాతినిత్య సంఘాల పుణ్యమే అని విమర్శించారు. గత ఆరు నెలల నుంచి డిస్మిస్ చేయబడిన కార్మికులు అన్ని విధాలుగా నష్టపోతూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా తిరిగి వారిని అందరిని ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు. అదేవిధంగా కేఎల్పి గనిలో జరిగిన ప్రమాదం కు బాధ్యుని చేసి మైనింగ్ సర్దార్ సాధుల ప్రకాష్ ను డిస్మిస్ చేయడం జరిగినదని, సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల సవితి ప్రేమ చూపిస్తూ అక్రమంగా డిస్మిస్లు చేస్తుందన్నారు. డిస్మిస్ చేసిన కార్మికులను భేషరతుగా ఉద్యోగాలకు తీసుకోవాలని, లేని పక్షంలో సింగరేణి గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆసంఘం నాయకులు బి ముకుందరావు, జి సాంబయ్య, ఎన్నం శంకర్ తదితరులు పాల్గొన్నారు