అక్రమ మద్యం నిల్వలపై దాడులు
భారీగా స్వాధీనం చేసుకున్న సరుకు
‘సిద్దిపేట,మార్చి 28 (జనంసాక్షి):
కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రమంతా లాక్ డౌన్ అమలవుతోన్న సందర్భంలో మద్యం విక్రేతలు ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు మొదలు పెట్టారు. సంపాదనే ధ్యేయంగా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. మద్యం షాపులను మూసేసినా దొడ్డిదారిన అమ్మకాలు చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని పారుపల్లి వీధి, అంబేద్కర్ నగర్ కాలనీల్లో అక్రమంగా ఇంట్లో మద్యం దాచి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి సిద్దిపేట టూ టౌన్ పోలీసులు దాడులు చేసి రూ. 65 వేల విలువ చేసే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పారుపల్లి వీధి, అంబేద్కర్‌నగర్‌లో మద్యం విక్రయిస్తున్న వారిపై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సీఐ పరుశురామ్ గౌడ్ మాట్లాడుతూ.. కరోనా వ్యాధి నివారణలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దన్నారు. వైన్ షాపులు, బార్లు కూడా మూసివేయడం జరిగింది. ఈ సమయంలో ఇండ్లలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, జూదం ఆడిన, గుట్కాలు విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే తక్షణమే సిద్దిపేట కమిషనరేటకు సమాచారం అందించాలని కోరారు. వాట్సాప్ నెంబర్ – 7901100100. సమాచారం అందించిన వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచబడును అని సీఐ తెలిపారు.