అక్రమ వలసదారుల ఇంటికి..
` నేడు 119 మంది అమృత్‌సర్‌కు రాక
అమృత్‌సర్(జనంసాక్షి):అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా.. ఇటీవల కొంతమంది భారతీయులను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే మరో రెండు విమానాల్లో మరింతమంది భారతీయులను స్వదేశానికి పంపేందుకు సిద్ధమైంది. వీటిలో తొలి విమానం 119 మందితో ఆదివారం అమృత్‌సర్‌లో దిగనుంది. అయితే, మరో విమానం ఎప్పుడు ల్యాండ్ అవుతుందనే దానిపై అస్పష్టత నెలకొంది.సీ`17 గ్లోబ్ మాస్టర్ 3 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్రమ వలసదారులను తరలిస్తున్నారు. తొలి విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్‌కు చెందినవారు. మిగిలినవారు హరియాణా (33), గుజరాత్ (8), ఉత్తరప్రదేశ్ (3) గోవా (2), రాజస్థాన్ (2), మహారాష్ట్ర (2), జమ్మూకశ్మీర్ (1), హిమాచల్‌ప్రదేశ్ (1) వాసులు. అక్రమ వలసదారులందరినీ వారి స్వదేశాలకు తిరిగి పంపేవరకు ప్రతివారం బహిష్కరణ ప్రక్రియ కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.ఇక, ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల వేళ.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ప్రధాని మోదీ ఈ అంశంపై చర్చించారు. అనంతరం చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. యువత, పేదరికంలో ఉన్నవారికి డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి అక్రమరవాణా కూపంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాలన్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా అక్రమ వలసదారులను ఉద్దేశిస్తూ.. శ్వేతసౌధం ఓ ఆసక్తికరమైన పోస్టును పంచుకుంది. ఒక గ్రీటింగ్ కార్డులో ‘గులాబీలు ఎరుపు రంగులో ఉంటాయి. వైలెట్‌లు నీలి రంగులో ఉంటాయి. చట్టవిరుద్ధంగా ఇక్కడికి వస్తే బహిష్కరిస్తాం’ అంటూ అక్రమంగా రావాలనుకునే వారిని హెచ్చరించింది. ఈ గ్రీటింగ్ కార్డులో సీరియస్‌గా ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు సరిహద్దు చీఫ్ థామస్ హోమన్‌ల ఫొటోలు ఉన్నాయి.