అఖిలపక్షంలో అనుకూలం..
హైదరాబాద్, డిసెంబర్ 27 (జనంసాక్షి) :
తెలంగాణకు అనుకూలంగా అఖిలపక్షంలో అభిప్రాయాన్ని వెల్లడించని పార్టీలను ప్రజలు తెలంగాణ ప్రాంతం నుంచి గెంటేస్తారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. శుక్రవారం అఖిలపక్షంలో పాల్గొనే పార్టీలపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో గురువారం ఇందిరా పార్కువద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ సీపీ, టీడీపీలు కచ్చితంగా ప్రజల అభిప్రాయాన్ని అఖిలపక్షం ముందు ఉంచాల్సిందేనన్నారు. ఇంకెంత కాలమో తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని, మోసం చేసే పార్టీల నాయకుల భవితవ్యాన్ని 29 తరువాత తేలుస్తామని ఆయన హెచ్చరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదని కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ కూడా అఖిలపక్షంలో భాగస్వామి అనే విషయాన్ని
మరచిపోరాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2008లో తాను అనుకూలంగా లేఖ ఇచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2008లో లేఖ ఇస్తే 2009 డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను ఎందుకు అడ్డుకున్నాడో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీపై నెపంపెట్టి తప్పించుకోవాలిని చూడటం సరికాదన్నారు. ముందు తెలంగాణపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇంకా ఓపిక పట్టే అవకాశం లేకుండా పోతోందని ఆగ్రహ జ్వాలల్లో ఈ నాయకులంతా మాడి మసై పోవడం ఖాయమన్నారు. శుక్రవారం జరిగే అఖిలపక్షంలో కచ్చితంగా అన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాల్సిందేనని, ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదన్నారు. తెలంగాణపై మొదటగా అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు. అఖిలపక్షం సమావేశం జరిగే రోజు జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మార్చిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని, దీనిని హైదరాబాద్ దద్దరిల్లేలా చేపడతామని ఆయన తెలిపారు. కేవలం కాలయాపనకే అఖిలపక్షం నిర్వహిస్తే తరువాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటూ రాజకీయ లబ్ధిపొందుతున్న పార్టీలకు తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం చెప్పే బాధ్యత ఉందని కోదండరాం అన్నారు. అఖిలపక్షం జరిగిన మరుసటి రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్షం నాయకుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా తమ వైఖరిని స్పష్టం చేయకపోతే ఆ పార్టీల జెండా దిమ్మలు ఒక్కటి కూడా తెలంగాణలో మిగలవని హెచ్చరించారు. టీడీపీ తెలంగాణ ప్రజలను తీవ్రంగా వంచించిందని, 2009లోనే వచ్చిన తెలంగాణను అడ్డుకుంది ఆపార్టీ కాదా? అంటూ నిలదిశారు. 2009లో తెలంగాణ ప్రజల ఓట్లతో సీట్లు గెలిచిన చంద్రబాబు ఆ తరువాత ఆంధ్రాబాబు అని నిరూపించుకున్నారని, తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా కేంద్రం నిర్ణయం తీసుకోకుండా అడ్డుపడ్డాడని ఆయన మండిపడ్డారు. ఈ సారి అఖిలపక్షంలో మోసం చేసేందుకు, నాటకాలేడుందుకు ఏ పార్టీ ప్రయత్నించినా ఆ పార్టీని భూ స్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఈ మహాధర్నాలో నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.