అఖిలపక్షం చిల్లరడ్రామా
కేంద్రం మళ్లీ తన బుద్ధిని చాటుకుంది
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 12 (జనంసాక్షి) :తెలంగాణ అంశంపై అఖిలపక్షం పేరుతో కాంగ్రెస్ చిల్లార డ్రామా ఆడుతోందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శిం చారు. ఏవీ కళాశాలలో కేవీ రంగారెడ్డి ఆత్మకథ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేసేందుకే అఖిలపక్ష సమావేశం పేరిట కొత్త నాటకం ఆడుతోందని మండిపడ్డారు. పార్టీకి ఇద్దరిని ఆహ్వానించడం ఏమాత్రం సరికాద న్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి ప్రతినిధులను పిలవడం
వల్ల సమస్య పరిష్కారం కాదని, పార్టీకి ఒక్కరినే పిలవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని, ఈ ప్రాంతానికి సంబంధం లేని సన్నాసుల విగ్రహాలను మాత్రం తెలంగాణ గడ్డమీద చాలా వరకు ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన గొప్ప వ్యక్తుల చరిత్రను మరచిపోయేలా చేసింది సీమాంధ్ర పాలకులేనని ఎద్దేవా చేశారు. ట్యాంక్ బండ్‌పై కర్నాటక రాష్ట్రానికి చెందిన వారి విగ్రహాలు పెట్టినప్పుడు కొండ వెంకటరంగారెడ్డి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేవీ రంగారెడ్డిలాంటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కొండా వెంకటరంగారెడ్డి పేరును యూనివర్సీటీలో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అలాగే అసెంబ్లీతో పాటు ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో భూములన్నీ మింగి రంగారెడ్డి పేరు తప్ప ఏమీ మిగల్చలేదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం సకలం బంద్ చేసినా ప్రధానికి సోయి లేదని, ఆయన కంటే చప్రాసీ నయమని తెలిపారు. తెలంగాణ రాకుంటే సీమాంధ్ర పాలకులు తెగబడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికల్లో 100 ఎమ్మేల్యే, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని, కేంద్రం మెడలు వంచి రాష్ట్రం సాధించుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలు ఢిల్లీని పట్టుకుని వేలాడకుండా రాజీనామాలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ వివేక్, మాజీ స్పీకర్ స్పీకర్ సురేష్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి కుటుంబాన్ని తెలంగాణ ఉద్యమంలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. యాచించి కాదు.. శాసించి ప్రత్యేక రాష్ట్రం సాధించకుందామన్నారు.
రాజ్యాంగాన్ని అవమానించేడమే
తెలంగాణ ఏర్పాటుపై అఖిల పక్షమంటే రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను రెండుగా విడగొట్టవచ్చని తెలిపారు.