అగ్గివిూద గుగ్గిలం అవుతున్న ఫారెస్ట్‌ అధికారులు

పంచాయితీ అధికారుల తీరుపై మండిపాటు
మంత్రి ఇంద్రకరణ్‌కు విషయం చేరవేత
పన్ను బకాయి పేరుతో తాళంతో బారున పడ్డ పరువు

 

నిర్మల్‌,జూలై7(జనం సాక్షి

): జిల్లాలో అటవీ, పంచాయతీశాఖల మధ్య వివాదం కాస్తా ఇప్పుడు రాజకీయ రంగు పులముకునేలా కనిపిస్తోంది. కడెం మండలంలోని ఫారెస్ట్‌రేంజ్‌ ఆఫీసు వారు పన్ను బకాయిలు చెల్లించడం లేదన్న ఆరోపణలపై పంచాయతీశాఖ వారి కార్యాలయాన్ని సీజ్‌ చేయడం దుమారం రేపు తోంది. దీనిపై జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దృష్టిక కొందరు తీసుకుని వెళ్లారు. అధికారుల తీరుపైనా ఆయనకూడా మండిపడ్డట్లు సమాచారం. ఇలా రోడ్డుకెక్కి పరువు తీసుకోవడం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా పంచాయతీ, అటవీశాఖల మధ్య నెలకొన్న తాజా వివాదంతో జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు స్పందించకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. జిల్లా యంత్రాంగం తీరుపై కూడా అటవీశాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పన్ను బకాయి చెల్లింపు కోసమే అటవీశాఖ కార్యాలయానికి తాళం వేశామే తప్పా మరో దురుద్దేశం లేదని, నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులు పరిశీలిస్తారని జిల్లా పంచాయతీ అధికారి అన్నారు. తాము టైగర్‌జోన్‌ కోర్‌ ఏరియాలో క్రీడా మైదానాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతోనే పంచాయతీశాఖ అధికారులు కక్షసాధింపు చర్యకు పాల్పడ్డారంటూ అటవీ అధికారులు బహిరంగంగా పేర్కొంటున్నారు. అటవీశాఖరేంజ్‌ కార్యాలయానికి పన్ను బకాయిల పేరిట తాళం వేసిన వ్యవహారం వెనక జిల్లా యంత్రాంగం పాత్ర కూడా ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకే అటవీశాఖ కార్యాలయానికి తాళం వేసి ఉండవచ్చన్న అనుమానాలను కూడా సంబంధిత శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. తాము ఆరుబయటనే విధులు నిర్వహిస్తున్నప్పటికి జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోతుండడం పట్ల అటవీశాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారం అటవీశాఖ అధికారుల ఆగ్రహానికి కారణమవుతోంది. రేంజ్‌ ఆఫీసుకు పంచాయతీ అధికారులు తాళం వేయడంతో ఫారెస్టు అధికారులంతా ఆరుబయట టేబుళ్లపై తమ విధులను నిర్వహిస్తున్నారు. అటవీశాఖ భూముల్లో డంపింగ్‌ యార్డులు, స్మశానవాటికలు, ప్రకృతివనాలు, క్రీడామైదానాలు లాంటివి ఏర్పాటు చేస్తున్న కారణంగానే ఈ రెండుశాఖల మధ్యదూరం పెరిగిందని అంటున్నారు. టైగర్‌జోన్‌ కోర్‌ ఏరియాలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవ్వడంతో అటవీశాఖ ఆ నిర్మాణాలను సీరియస్‌గా అడ్డుకుంది. ముఖ్యంగా కడెం మండలంలోని బుట్టాపూర్‌ గ్రామంలో గల టైగర్‌ రిజర్వ్‌కోర్‌ ఏరియాలో క్రీడామైదానాన్ని ఏర్పాటు చేసేందుకు పంచాయతీ అధికారులు ప్రతిపాదించారు. అయితే అటవీ నిబంధనల ప్రకారం టైగర్‌ రిజర్వ్‌కోర్‌ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, అలాగే ఎలాంటి అభివృద్ది పనులు కూడా చేయవద్దంటూ నిబంధనలున్నాయి. అయితే ఈ నిబంధనలను పట్టించుకోకుండా పంచాయతీశాఖ క్రీడామైదానం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. అటవీశాఖ అధికారులు దీనిని సీరియస్‌గా అడ్డుకోవడమే కాకుండా అనుమతి నిరాకరించారు. అప్పటి నుంచి అటవీశాఖపై పంచాయతీశాఖ అధికారులు కక్షగట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటవీశాఖ రేంజ్‌ ఆఫీసుకు తాళం వేసిన వ్యవహారాన్ని ఆ శాఖ అధికారులు సీరియస్‌గానే పరిగణిస్తున్నారు. అటవీశాఖ ఉద్యోగుల సంఘం బాధ్యులు మంగళవారం నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. మంత్రి సైతం పంచాయతీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.