అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌

ఈ డబ్ల్యూ ఎస్‌ పది శాతం అమలుకు సర్కారు నిర్ణయం
సీఎం కేసీఆర్‌ వెల్లడి
హైదరాబాద్‌, జనవరి 21 (జనం సాక్షి):
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్‌.) పదిశాతం రిజర్వేషన్‌ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు.”ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్య్యు.ఎస్‌.లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇడబ్ల్యుఎస్‌ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కొత్త ఆయకట్టు సృష్టించాలి
సాగర్‌ తో కలిపి పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశిం చారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్‌ ఆయకట్టును కూడా కలుపు కుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజె క్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సిఎం అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ము ఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌ లో సవిూక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ఇఎన్సీలు మురళీధర్‌ రావు, హరేరామ్‌, సిఇలు వెంకట కృష్ణ, శంకర్‌ నాయక్‌, మధు సూదన్‌ రావు, ఎస్‌.ఇ. శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌ రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.”అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది. దుమ్ముగూడెం పాయింట్‌ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. ఈ నీటి ద్వారా ఖమ్మం జిల్లా యావత్తు నీరు అందించవచ్చు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి, అటు ఇల్లందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్‌ కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలి. సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాలువలకు సంబంధించిన మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి, టెండర్లు పిలవాలి. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్‌ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్‌ కల్లా పూర్తి చేయాలి.  కృష్ణా నదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియదు. అంతా అనిశ్చితి ఉంటుంది.  కృష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్‌ ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి” అని సిఎం చెప్పారు.

నల్గొండ రోడ్డు ప్రమాదం పై
సీఎం కేసీఆర్‌గ్భ్భ్రాంతి
నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాక్సిడెంట్‌ కు దారితీసిన పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ  సానుభూతిని తెలిపారు. గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు.

ఆర్టీసీని కాపాడుకోవాలి
భారీగా పెరిగిన డీజిల్‌ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్‌ డౌన్‌, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు నివేదించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం లాంటి చర్యలు తీసు కుంటే తప్ప ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గే అవకాశంలేదని వారు విన్నవించారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ లో గురువారం సవిూక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఫైనాన్స్‌ అడ్వయిజర్‌ రమేశ్‌, కార్గో స్పెషల్‌ ఆఫీసర్‌ కృష్ణకాంత్‌, ఇ.డి. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ఆర్టీసీ పరిస్థితిని వివరించారు.”క్రితం సారి బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్‌ డీజిల్‌ ధర 67 రూపాయలు ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్‌ కు 15 రూపాయలు పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక భారం మోపింది. కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ సమయంలోనూ ఆర్టీసీ నష్టాలను చవిచూసింది. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల భారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాల్సి ఉంది. ఒకవేళ జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదు” అని అధికారులు సిఎంకు వివరించారు.”వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైంది. ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితం వచ్చింది. ఆక్యుపెన్సీ శాతం 58 శాతానికి చేరుకుంది. క్రమంగా ఇది పెరుగుతున్నది. దీనివల్ల రోజుకు 9 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. అయితే డీజిల్‌ రేట్లు పెరుగుతుండడం నష్టదాయకంగా మారుతున్నది. లాక్‌ డౌన్‌ మిగిల్చిన నష్టాలు, పాత అప్పులు ఇంకా గుదిబండగానే ఉన్నాయి” అని వారు వివరించారు. ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్శిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసికి 22.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సిఎం చెప్పారు. ప్రజలు కూడా ఆర్టీసీ కార్గో సేవల పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారని సిఎం అభినందించారు. ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్‌ ఆఫీసర్‌ కృష్ణకాంత్‌ ను ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని సిఎం అన్నారు. అటు మారుమూల ప్రాంతాలకు, ఇటు నగరంలోని ఇంటింటికి డోర్‌ డెలివరీ చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు, ప్రయాణీకులకు సేవలు అందించాలని సిఎం పిలుపునిచ్చారు.