అగ్రిగోల్డ్ ఆస్తుల కన్నా చెల్లింపులే తక్కువ
ఆస్తులు దక్కించుకునే కుట్రలో నేతలు?
ఏలూరు,మే25(జనంసాక్షి): అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు సహా మరికొందరు ఇప్పటికే జైలులో రిమాండ్ ఖైదీలులగా ఉండగా, తప్పించుకున్న వారి కోసం వేట ముమ్మరం చేయడంతో అవ్వా సీతారామారావు కూడా దొరకడం, ఆయనకు రిమాండ్ విధించడం జరిగింది. అగ్రోగోల్డ్ వ్యవహారాన్ని త్వరగా ముగించేందుకు అవసరమైన విచారణ వేగవంత చేస్తున్నా ఎందుకనో కొలిక్కి రావడం లేదు. అగ్రిగోల్డ్ మదుపుదారులకు చెల్లించేదానికన్నా ఆస్తులు ఎక్కువగా ఉన్నా కొందరు అధికార పార్టీ నేతలు ఆస్తులను దక్కించుకునేందుకు కేసును నీరుగార్చే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల బినావిూ అస్తులకు సంబంధించి కీలక సమాచారం ఉందన్న కోణంలో దర్యాప్తు సాగుతోందని తెలిసింది.
మరోవైపు బినామా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వేలానికి వచ్చిన అగ్రిగోల్డ్ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కీసరలో కోట్లాది రూపాయిల విలువైన సుమారు 750 ఎకరాల భూములను వేలం ద్వారా విక్రయించాలని ఇప్పటికే హైకోర్టు
ఆదేశాలు జారీ చేసింది. కానీ రాజకీయ ఒత్తిడుల వల్ల అగ్రిగోల్డ్ ఆస్తులు వేలంలోకి రావడంలేదనే ఆరోపణలున్నాయి. సిఐడి జప్తు చేసిన ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటుందన్న బాధితులు, సుమారు రూ.1100 కోట్లు చెల్లిస్తే 70 శాతంపైగా ఖాతాదారులకు ఊరట లభిస్తుందని చెబుతున్నారు. అగ్రిగోల్డ్ సంస్థలో కీలకంగా వ్యవహరించి కోట్లాది రూపాయిల వ్యక్తిగత ఆస్తులను సంపాదించుకున్న ఇతర నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. అందరినీ పట్టుకుని ఆస్తులను అమ్మితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు.