అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ
ఖమ్మం,మార్చి9జనంసాక్షి: ఖమ్మం జిల్లా చంద్రుగుండు మండలంలోని మర్రిగూడెం గ్రామంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అటవీ సరిహద్దు ప్రాంతంలో అధికారులు కందకం పనులను సోమవారం చేపట్టారు. అయితే తాము పోడు వ్యవసాయం చేసుకునే భూముల్లో కందకం పనులను నిర్వహించవద్దని గిరిజనులు అడ్డుకున్నారు. వెంటనే పనులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. అటవీ సిబ్బంది ససేమిరా అనడంతో గిరిజనులు సిబ్బంది కళ్లల్లో కారం చల్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. అటవీ శాఖ సిబ్బంది గిరిజనులపై లాఠీ చార్జి చేశారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థతి విషమంగా ఉంది. బాధితుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.