అడవిదొంగలపై ఆలస్యంగా చర్యలు 

ఇప్పటికే నష్టపోయిన సంపద ఎంతో?
ఆదిలాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను అందిన కాడికి దోచుకున్నారు. అడవులను పూర్తిగా ధ్వంసం చేశారు. వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా వేటాడారు. ఆదిలాబాద్‌ జిల్లా అంటే దట్టమైన దండకారణ్యంతో ఒకప్పుడు అడవుల జిల్లాగా పేరు ఉండేది. ఆకాశాన్ని ముద్దాడే టేకు వృక్షాలతో కనుచూపు మేర పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలరావాల, చెంగుచెంగున ఎగిరే జింకలతో అహ్లాదకరంగా ఉండేది. స్మగ్లర్ల, వేటగాళ్ల ధన దాహానికి అటవీశాఖ అధికారుల అవినీతి, అక్రమాలు తోడవడం తో అడవి తల్లి నేలకొరగగా, వన్యప్రాణులు అంతరించిపోయే దుర్భర పరిస్థితి దాపురించింది. కవ్వాల్‌ అభయారణ్యంతోపాటు జిల్లాలోని ఇతర అటవీ ప్రాంతాల నుంచి టేకుతోపాటు ఇసుక, రాయి, మొరం అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయం అంతా కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలిసినప్పటికీ మామూళ్లు తీసుకుని మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అటవీశాఖ చెక్‌పోస్టుల్లోని సిబ్బంది అడవుల నుంచి అక్రమ కలప, ఇసుక, రాయి, వన్యప్రాణుల మాంసాన్ని తరలించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉండగా వాటిని ఆ వాహనాల నుంచి డబ్బులు తీసుకు ని వదిలిపెట్టడంతోపాటు- ఇతర వాహనాల నుంచి కూడా ఎంతో కొంత ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజర్వు ఫారెస్టులో చెరువుల నిర్మాణాలు చేపట్టరాదనే
నిబంధనలు ఉన్నప్పటికీ పెంబి రిజర్వు ఫారెస్టులో చెరువులను నిర్మించారు. జిల్లా విస్తీర్ణంలో ఒకప్పుడు 40 శాతం ఉన్న అడవి ఇప్పుడు చాల తక్కువ శాతంలో ఉంది.  జిల్లా నుంచి ప్రతి రోజు లక్షలాది రూపాయల విలువ చేసే టేకు కలప కరీంనగర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ అక్రమంగా తరలిపోతుంది. ఆదిలాబాద్‌ టేకు కలపకు ఇ తర ప్రాంతాల్లో మంచి డిమాండ్‌ ఉండడంతో స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కోట్లాది రూపాయల కలప అ క్రమంగా తరలిపోతుంటే లక్షలాది రూ పాయల అక్రమ కలపను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నా రు. జింక, దుప్పులు, అడవి పంది తదితర వన్యప్రాణులను వేటగాళ్లు హతమార్చి మాంసాన్ని కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో కలప స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్లు ఎవరూ, వారు ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే విషయాలు అటవీశాఖ అధికారులకు తెలిసినప్పటికీ వారు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి పట్టించుకోడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ ప్రాంతంలోని  2 వందల ఎకరాల్లోని కోట్లాది రూపాయల విలువ చేసే టేకు వృక్షాలను గిరిజనులు పోడు వ్యవసాయం పేరిట నరికివేశారు.వందలాది ఎకరాల్లోని వేలాది టేకు వృక్షాలను నరికి అక్రమంగా కలపను ఇతర ప్రాంతాలకు ఇప్పటికే తరలించుకు పోయారు. అటవీ సంపద నాశనం కావడానికి కారకులైన ఆ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అడవిని, కవ్వాల్‌ అభయారణ్యం నుంచి చిన్న కర్ర కూడా బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.  గతంతో పోలిస్తే భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు.