అడిలైడ్‌లో పరుగుల వరద మైకేల్‌ క్లార్క్‌ మరో డబుల్‌ – వార్నర్‌ , హస్సీ సెంచరీలు

అడిలైడ్‌ ,నవంబర్‌ 22:  దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టులో ఆస్టేల్రియా పరుగుల వరద పారిస్తోంది. తొలిరోజే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ సెంచరీలతో రెచ్చిపోయారు. అడిలైడ్‌ వేదికగా ఇవాళ మొదలైన మ్యాచ్‌లో ఆసీస్‌ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. టాస్‌ గెలుచుకున్న ఆ జట్టు 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ , కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ సఫారీ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. వన్డే తరహాలో పరుగుల వర్షం కురిపించారు. ఒక ఎండ్‌ నుండి వార్నర్‌… మరో ఎండ్‌ నుండి క్లార్క్‌ ఫోర్లు బాదేస్తుంటే సఫారీ బౌలర్లు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. ఈ క్రమంలో వార్నర్‌ , క్లార్క్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోరుకు ఆసీస్‌ స్కోర్‌ 56 ఓవర్లలోనే 300 మార్క్‌ దాటింది. వార్నర్‌ 119 రన్స్‌కు ఔటైనా… క్లార్క్‌ జోరు ఏమాత్రం తగ్గలేదు. మరో బ్యాట్స్‌మన్‌ మైక్‌ హస్సీతో కలిసి దూకుడు కొనసాగించాడు. దీంతో కెరీర్‌లో మరో డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది అతనికిది నాలుగో డబుల్‌ సెంచరీ కావడం విశేషం. అటు కెప్టెన్‌ నుండి స్ఫూర్తి పొందిన హస్సీ కూడా రెచ్చిపోయి సెంచరీ సాధించాడు. దీంతో ఆస్టేల్రియా స్కోర్‌ తొలిరోజే ఐదు వందలకు చేరువైంది. మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి ఆస్టేల్రియా 5 వికెట్లకు 482 పరుగులు చేసింది. హస్సీ 103 ( 9 ఫోర్లు , 4 సిక్సర్లు )పరుగుల దగ్గర ఔటయ్యాడు. అయితే డబుల్‌ సెంచరీ హీరో క్లార్క్‌ 224 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 39 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. ఆట ముందే నిలిపివేయకుంటే ఆసీస్‌ స్కోర్‌ 500 మార్క్‌ దాటి ఉండేది. టెస్టుల్లో ఒకేరోజు అత్యధిస్కోర్‌ 588 పరుగులు. అటు రోజంతా బౌలింగ్‌ చేసిన సఫారీ బౌలర్లు ఐదు వికెట్లు పడగొట్టినా… ఆసీస్‌ను కట్టడి చేయలేకపోయారు. పలు అవకాశాలను నేలపాలు చేయడం కూడా వారికి మైనస్‌గా మారింది.