అణగారిన కులాలకే రాజ్యాధికారం
ఆదిలాబాద్్, జూలై 18 : అట్టడుగు వర్గాల వారికి రాజ్యాధికారం సాధించేందుకే ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని అనగారిన కులాల సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి హైదర్ పేర్కొన్నారు. దళితులు, ముస్లింలు, బీసీలకు రాజ్యాధికారం అందించటమే తమ సంఘం అంతిమ లక్ష్యమని అన్నారు. ఇందులోభాగంగా రాజ్యాధికార యాత్ర విశాఖపట్నంలో ప్రారంభించామని ఈ యాత్ర అగస్టు 28న హైదరాబాద్లో ముగుస్తుందని ఆయన వివరించారు. ముస్లింలకు చట్టసభలతోపాటు అన్ని రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీవరకు ముస్లిం రాజ్యాధికార యాత్ర కొనసాగించి అక్టోబర్ 1న హైదరాబాద్లో ముస్లింల సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని రంగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2 నుండి నవంబర్ 2 వరకు బీసీల రాజ్యాధికార యాత్ర చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్రల తర్వాత డిసెంబర్ 4న లక్షలాది మందితో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించి కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.