అత్యధిక స్థానాల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం
ఏకగ్రీవాలతో పాటు,ఎన్నికల్లోనూ గులాబీ దండు సత్తా
కెసిఆర్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమన్న అల్లోల్ల
నిర్మల్,జనవరి22(జనంసాక్షి): జిల్లాలో ఏకగ్రీవ పంచాయితీల్లో సత్తా చాటిన టిఆర్‌ఎస్ అభ్యర్థులు నేరుగా జరిగిన ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించారు. 134 స్థానాలకుగాను 57 చోట్ల ఏకగ్రీవం కాగా.. ఇందులోనూ పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్ ఆధిపత్యం కనబరిచింది. 57 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో 55 గ్రామ పంచాయతీల్లో గులాబీ మద్దతుదారులు సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకచోట బీజేపీ మద్దతుదారులు, మరోచోట ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్ష్మణచాందలో నాలుగు గ్రామ పంచాయతీలకుగాను మూడుచోట్ల టీఆర్ ఒకచోట బీజేపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మామడలో 13 గ్రామ పంచాయతీలకుగాను 13 చోట్ల టీఆర్‌ఎస్ పెంబిలో 20జీపీలకుగాను 20చోట్ల, ఖానాపూర్ పది జీపీలకుగాను పదిచోట్ల, కడెంలో 9 జీపీలకుగాను 9 చోట్ల టీఆర్ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలో తొలి విడతలో భాగంగా 134 గ్రామపంచాయతీలు, 1058 వార్డులకు ఎన్నికలు జరగగా వీటిలో 57 గ్రామ పంచాయతీలు, 574 వార్డులు ఏకగ్రీవం కాగా.. 77 గ్రామ పంచాయతీలు, 480 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో 134 గ్రామ పంచాయతీల్లో 104 గ్రామపంచాయతీల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. మరో 21 చోట్ల ఇతరులు గెలుపొందగా.. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కేవలం 8 గ్రామపంచాయతీల్లో గెలిచారు. వందకు పైగా స్థానాల్లో టీఆర్ మద్దతుదారులు విజయం సాధించి సత్తా చాటారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రభావం ఏ మాత్రం లేకపోవడంతో మద్దతుదారులు ఘోర పరాజయం చవిచూశారు. పెంబి మండలంలో 24 పంచాయితీలకు అన్నిచోట్ల టీఆర్ మద్దతుదారులే ఎన్నికయ్యారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సత్తా చాటడంపై మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల్లో కెసిఆర్ పట్ల ఉన్న అభిమానానికి ఫలితాలు అద్దం పట్టాయన్నారు.