అత్యాచార పర్వాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన ప్రజలు
కదలి వచ్చిన విద్యార్థులు, యువత
దాచేపల్లి తరహా ఘటనలపై తీవ్ర నిరసన
గుంటూరులో ర్యాలీ… కోడెల ప్రారంభం
గుంటూరు,మే7(జనం సాక్షి): ఆడబిడ్డకు రక్షణగా గుంటూరు నగరం కదలి వచ్చింది. దాచేపల్లి తరహా అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు కదం తొక్కారు. ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు… గుంటూరు నగరంలో సోమవారం భారీ
ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ కూడలి నుంచి హిందూ కళాశాల వరకు ప్లకార్డులు చేతబట్టి వేలాది మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఇందులో విద్యార్థినలు అధికంగా పాల్గొన్నరు. సభాపతి కోడెల శివప్రసాదరావు ఈ ర్యాలీని ప్రారంభించగా…. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ రామకృష్ణ, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీలు అప్పలనాయుడు, విజయరావు ప్రదర్శనలో పాల్గొని మహిళలు, చిన్నారులకు సంఘీభావం ప్రకటించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని… వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని సభాపతి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చట్టాలకు పదను పెట్టడంతో పాటు… ఉన్న చట్టాలను సమర్థవంతంగా అధికారులు అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడబిడ్డలపై సామాజిక వివక్ష పోవాలన్న సభాపతి… అమ్మాయిలకు బాల్యం నుంచి పిరికితనం నూరిపోయరాదని తల్లిదండ్రులకు సూచించారు. ఇలాంటి దురాగతాలకు రాష్ట్రంలో చోటులేదని… దాచేపల్లి ఘటనే ఆఖరిది కావాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును మంత్రి పుల్లారావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంటర్ నెట్లో అశ్లీల దృశ్యాల నియంత్రణపై కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. నిర్భయ చట్టం వచ్చినా ఈ దురాగతాలు కొనసాగడంపై మంత్రి ఆనందబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దాచేపల్లి ఘటనను కొందరు రాజకీయం చేశారంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు.