అత్యాచార బాధితురాలని పరామర్శించిన మమతా బెనర్జీ

0h26cgdcపశ్చిమబెంగాల్‌, మార్చి 17 : నన్‌పై అత్యాచారఘటన పశ్చిమబెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. అయితే మమతను ఆందోళనకారులు ఘోరావ్‌ చేశారు. దాంతో వారిపై ఆమె మండిపడ్డారు. 70ఏళ్ల నన్‌పై అత్యాచార ప్రాంతాన్ని మమత సందర్శించారు. మార్గ మధ్యలో మమత కాన్వాయ్‌ను ఆందోళన కారులు అడ్డుకున్నారు. బాధితురాలికి న్యాయం చేయలేదంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన మమతా కారులోంచి కిందికి దిగి.. ఈ ఘటనకు విపక్షాలే కారణమంటూ మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే తనను అడ్డుకున్నారంటూ ఆందోళనకారులపై ఆమె విరుచుకుపడ్డారు. సీఎం కాన్వాయ్‌కు దారి వదలాల్సిందిగా పోలీసులు, మతాధికారులు విజ్ఞప్తి చేయగా ఆందోళనకారులు దారివదిలారు. రాణాఘాట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నన్‌ను మమతా బెనర్జీ పరామర్శించారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టమని మీడియాకు ఆమె స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 10 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదు.