అదానీని అరెస్టు చేయాలి
` జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి
` లేకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ఆందోళన చేస్తా
` రాజ్‌భవన్ ముందు బైటాయించిన రేవంత్
` మోదీ తన మిత్రులతో కలిసి దేశం పరువు తీస్తున్నారని మండిపాటు
హైదరాబాద్(జనంసాక్షి):భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకు పోయాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠను పెంపొందించిందని చెప్పారు. అదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును తాకట్టుపెట్టారని ఆక్షేపించారు. ఆదానీని ప్రధాని వెనకేసుకుని వచ్చినా, అమెరికా మాత్రం వదలదని హెచ్చరించారు. ఆదానీపై చర్యలకు ఢల్లీిలో కూడా ధర్నాకు వెనకాడబోమని సిఎం రేవంత్ హెచ్చరించారు. మణిపుర్ అల్లర్లు, అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ’చలో రాజ్‌భవన్’ చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ సవిూపంలో సీఎం బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయి. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్‌బీఐ నివేదించడంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. దేశం పరువును మంటగలిపిన అదానీపై విచారణ జరగాలి. దీనిపై విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలి. అదానీ అవినీతిపై చర్చ, జేపీసీ వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. అలా చేస్తే అదానీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆయన్ను కాపాడేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారు. ఈ అంశంపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తాం అని రేవంత్‌రెడ్డి అన్నారు. 75 ఏళ్లు కష్టపడి దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పెంచితే.. ప్రధాని మోడీ, ఆయన మిత్రుడు అదానీ కలిసి దేశ పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్ నుండి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి రాజ్ భవన్ రూట్‌లో బైఠాయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. వ్యాపారం చేసేందుకు బిలియనీర్ అదానీ లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిలదీశారు.. కానీ ప్రధాని మోడీ దీనిపై మౌనంగా ఉంటున్నారని అన్నారు. అదానీతో ప్రధాని మోడీకి లాలూచీ ఒప్పందం ఉందని.. అందుకే అదానీ కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడిరచామని తెలిపారు. మా పోరాటం ఇక్కడితో ఆగదని.. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వమే ధర్నాలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.. కానీ దేశ ప్రతిష్టను కాపాడుకోవడానికే రోడ్డుపై నిరసన తెలపాల్సి వచ్చిందన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నామని స్పష్టం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే మేం ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని.. ముఖ్యమంత్రి ధర్నా చేస్తారా అని బీఆర్‌ఎస్ అంటోంది.. నేను ధర్నా చేయను.. మరీ వాళ్లు వచ్చి చేస్తారా అని ప్రశ్నించారు. అదానీ అంశంపై బీఆర్‌ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ సై అంటే అసెంబ్లీలో ఆదానీ అంశంపై చర్చించి తీర్మానం చేస్తామని అన్నారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో ఆయన మిత్రుడు, బిలియనీర్ గౌతమ్ అదానీ దేశ సంపద దోచుకుంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అదానీ దేశ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. అదానీ దేశ ప్రజలను సొమ్మును ఏ విధంగా దోచుకుంటున్నారు.. బ్యాంకులను ఓ విధంగా మోసం చేశారో హిండెన్ బర్గ్, అమెరికా న్యాయవాదులు చెప్పారని గుర్తు చేశారు. అదానీ ఆర్థిక అవకతవకలపై పార్లమెంట్‌లో చర్చ కోసం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కొన్ని నెలలుగా జాతుల మధ్య అల్లర్లతో మణిపూర్ అట్టుడికిపోతున్న మోడీ నోరు విప్పడం లేదని విమర్శించారు. ఈ క్రమంలోనే అదానీ ఇష్యూ, మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ ఏఐసీపీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దిగామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు దీనిలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం రాజ్‌భవన్ సవిూపంలో రోడ్డుపై సీఎం రేవంత్, మంత్రులు, నేతలు బైఠాయించి నిరసన తెలిపారు.