అదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో.. మగ శిశువు అపహరణ 


– ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి ఖాకీలు
– మూడు గంటల్లోనే తల్లి ఒడికి శిశువు
– నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– పోలీసుల పనితీరుపై ప్రశంసల జల్లు
అదిలాపాదు, జులై10(జ‌నంసాక్షి) : ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో సోమవారం అర్థరాత్రి మగ శిశువు అపహరణ కలకలం సృష్టించింది. అప్పటి వరకు తల్లిఒడిలో ఉన్న బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించటంతో మూడు గంటల్లో కేసు చేధించిన పోలీసులు శిశువును తల్లి ఒడికి చేర్చారు.. వివరాల్లోకి వెళితే..  జిల్లాలోని నార్నూర్‌ మండలం చోర్‌గావ్‌ గ్రామానికి చెందిన గణెళిశ్‌ భార్య మమత ఈ నెల నాలుగో తేదీన రిమ్స్‌ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో తల్లి పొత్తిళ్లలో బాబు కనిపించకపోవడంతో ఆమె ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న ఆదిలాబాద్‌ డీఎస్పీ నర్సింహరెడ్డి రంగంలోకి దిగి చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేయాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి, చుట్టు పక్కల పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. మంగళవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఆదిలాబాద్‌ పట్టణం మహాలక్ష్మివాడకు చెందిన పుష్పలత అనే మహిళ తన భర్తతో కలిసి ప్రైవేటు వాహనంలో పసికందుతో సహా పయనిస్తుండగా నేరడిగొండ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పసాగింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు చిన్నారితో సహా మహిళను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ చిన్నారిని గుర్తుపట్టడంతో బిడ్డను ఆమెకు అప్పగించి పుష్పలత దంపతులను అరెస్ట్‌ చేశారు. మూడు గంటల్లోనే అపహరణ కేసును చేధించిన పోలీసులను అదనపు ఎస్పీమోహన్‌రెడ్డి అభినందించారు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా
నిందితులను విచారించగా తమకు సంతానం లేకపోవటం వల్లనే ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.