అది కారు ప్రమాదం కాదు, ఆత్మహత్యే: అప్పులే కారణమన్న పోలీసులు

2యానాం: గత శుక్రవారం రాత్రి యానాంలోని దరియాల తిప్పజెట్టి వద్ద గోదావరినదిలో కారు దూసుకెళ్లి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చినట్లు యానాం సీఐ సుబ్రమణ్యం, ఎస్సై కనకారావు తెలిపారు. కాకినాడకు చెందిన కొప్పాడ పవన్‌కుమార్‌ తన భార్య పార్వతి, తల్లిదండ్రులు సత్యరాజు, ధనలక్ష్మి, కుమార్తెలు రిషిత, నిషితలతో కారులో కాకినాడ నుంచి శుక్రవారం రాత్రి యానాం వచ్చి ఈ దురాఘతానికి ఒడిగట్టాడని తెలిపారు. బీఏ వరకు చదువుకున్న పవన్‌కుమార్‌ అధిక ఖర్చులకు, ఖరీదైన జీవితానికి అలవాటు పడి రూ.75 లక్షల వరకు అప్పుల పాలయ్యాడని చెప్పారు. తనను బకాయి చెల్లించమని కోరిన వారికి డిసెంబర్ 13న నగదు చెల్లిస్తానని మాట ఇచ్చి 11వ తేదీన రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద అప్పులు చేశాడని నెలవారీ వడ్డీలు కచ్చితంగా చెల్లించడంతో బాకీ కోసం ఎవరూ ఇంటికి వచ్చేవారు కారని తెలిపారు. దీంతో ఎవరికీ విషయం తెలియలేదని పేర్కొన్నారు. సోమవారం పోలీసులు కాకినాడ వెళ్లి బంధువులు, స్నేహితులు, ఇతడికి అప్పులు ఇచ్చిన వారిని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు చెప్పారు. అప్పుల భారం వల్లే పవన్‌ కుమార్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిపారు. కాగా, పవన్‌ కుమార్‌ పెద్ద కుమార్తె హరిశ్రీ కాకినాడలో చదువుతోంది. హరిశ్రీని తనతో రమ్మని అడగ్గా పరీక్షలున్నాయని కాకినాడలో తన అమ్మమ్మ వద్ద ఉండిపోయింది. దీంతో ఈ ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలు దక్కించుకుంది.