అదృశ్యమైన చిన్నారుల వివరాల సమర్పించనందుకు మండిపాటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ : కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏటా వేల సంఖ్యలో అదృశ్యమవుతున్న బాలల విషయంలో ఆయా ప్రభుత్వాలు ఏంచేస్తున్నాయో స్టేటన్‌ నివేదిక ఇవ్వమని, న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరుకమ్మని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఆదేశానికి స్పందించని అరుణాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయనందుకు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేస్తామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌ అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం ఈ విషయంలో ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేయని కేంద్రానికి, రాష్ట్రాలకు చివరి అవకాశం ఇచ్చింది. ఈ నెల 19 లోగా వాటిని దాఖలు చేయాలని సూచించింది. వేల సంఖ్యలో అదృశ్యమవుతున్న బాలల గురించి ఎవరికీ పట్టినట్లు లేదే..అని ధర్మాసనం ఆక్షేపించింది. మన దేశంలో ఏటా దాదాపు 60 వేల మంది బాలలు అదృశ్యమవుతున్నట్లు జాతీయ నేర గణాంక విభాగం లెక్కలు చెప్తున్నాయి.