అదే నాకు సరైన గమ్యస్థానం!

ఆర్‌బిఐ గవర్నర్ గా తన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందన్న వార్తలపై మాట్లాడేందుకు రాజన్ నిరాకరించారు. “ఈ వార్తలను నేను కాదనను. అలా అని ఔననను. సెప్టెంబర్ 3 వరకు గడువుంది. ఆర్థిక మంత్రి చెప్పినట్టు అప్పటి వరకు వేచి చూడండి” అన్నారు. యుపిఎ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన చిదంబరంతో ఉన్నట్టే, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో తనకు అత్యంత సుహృద్భావ సంబంధాలున్నాయన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ జోక్యానికి ప్రధాని మోదీ తెరదించారని ప్రశంసించారు. అటు రాజన్ పూర్తి స్థాయిలో భారతీయుడు కాదన్న బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు. ఆ ఆరోపణలపై మాట్లాడి ఆ విమర్శలకు చట్టబద్దత ఇవ్వలేనన్నారు. విమర్శలు విధానాలపై ఉండాలే తప్ప, వ్యక్తిగతంగా కాదన్నారు. అటు ఆర్థిక శాస్త్ర బోధన, పరిశోధనపై తనకున్న మక్కువను రాజన్ మరోసారి వెల్లడించారు. “మళ్లీ అర్థిక శాస్త్ర బోధన, పరిశోధనకు వెళ్లాలన్నది నా చిరకాల కోరిక. అదే నాకు సరైన గమ్యస్థానం” అన్నారు. ఆర్బిఐ గవర్నర్గా రిటైర్ అయ్యాక అమెరికాలోని చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్లో మళ్లీ ఆర్థిక శాస్త్ర పాఠాలు చెబుతానని రాజన్ ఇంతకు ముందే ప్రకటించారు.