అదే వివక్ష

2

– ఆంధ్రాకు లక్ష 93 వేల ఇళ్లు

– తెలంగాణకు కేవలం 10 వేలు మాత్రమే

– వెంకయ్యమార్కు సవితితల్లి ప్రేమ

– పార్లమెంటులో నిలదీస్తాం

– టీఆర్‌ఎస్‌ ఎంపీలు

హైదరాబాద్‌,నవంబర్‌20(జనంసాక్షి):

కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ సవతితల్లి ప్రేమను పార్లమెంటులో నిలదీస్తామని టిఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రకటించారు. ఎన్డీయేతర రాష్ట్రాలపై వివక్ష చూపుతూ కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ వ్వయహారంపై నిలదీస్తామని ఎంపిలు కవిత, బూర నర్సయ్య గౌడ్‌లు వేర్వేరుగా ప్రకటించారు. కేంద్రంలో  అర్థంలేని పాలన నడుస్తోందని నిజామాబాద్‌ ఎంపీ కవిత విమర్శించారు. హైదరాబాద్‌లో కవిత విూడియాతో మాట్లాడుతూ… కేంద్రంలో మోదీ పాలన పొలిటికల్‌ ఫెడరలిజాన్ని తలపిస్తోందని ఆరోపించారు. ఏపీకి రూ.8వేల కోట్లిచ్చిన కేంద్రం, తెలంగాణకు నయాపైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర గృహనిర్మాణమంత్రి ఏపీకి 2లక్షలు, తెలంగాణకు 10వేల గృహాలు మంజూరు చేశారని తెలిపారు. కేంద్ర గృహ నిర్మాణమంత్రి ఆంధ్ర పట్ల పక్షపాతాన్ని చాటుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌లో నిలదీస్తామన్నారు.తెలంగాణకు కేవలం పది వేల ఇళ్లు ఇచ్చి, ఎపికి 193,000 ఇళ్లు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తన వివక్షను తెలియచేసిందని  కవిత విమర్శించారు. తన నియోజకవర్గమైన నిజామాబాద్‌ లోనే డబ్బై వేల ఇళ్లు అవసరం అయితే తెలంగాణ అంతటికి కలిపి పదివేల ఇళ్లను కేంద్రం మంజూరు చేయడం అన్యాయమని అన్నారు. రిపోర్టులు పంపలేదనో,మరొకటనో ప్రచారం చేసి కెసిఆర్‌ ను, తెలంగాణను బదనాం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.ఈ విషయాలపై పార్లమెంటులో తాము నిలదీస్తామని ఆమె చెప్పారు. ప్రధాని మోడీ సమాఖ్య స్పూర్తిని విస్మరించి వ్యవహరిస్తున్నారని ,అందుకు ఇళ్ల కేటాయింపే పెద్ద ఉదాహరణ అని కవిత వ్యాఖ్యానించారు.బీజేపీ తెలంగాణ వ్యతిరేక ధోరణులు పరాకాష్ఠకు చేరాయనడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే సాక్ష్యమని టీఆర్‌ఎస్‌కు చెందిన భువనగిరి లోక్‌సభ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఎంపీ  విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు 1.90లక్షల ఇళ్లను కేటాయించిన కేంద్రం… తెలంగాణకు మాత్రం 10వేల ఇళ్లను మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. ఏపీకి 17 సంస్థలు సహా రూ.8వేల కోట్లు ఇచ్చి… తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను కూడా కేటాయించలేదన్నారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులిస్తోందని… తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతోందన్నారు. ఎయిమ్స్‌పై నివేదికలిచ్చినా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఈ అంశాలన్నింటిని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని ఎంపీ స్పష్టం చేశారు.అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేసుకుంటూ టీం ఇండియాలా ముందుకు సాగుదామని పదే పదే చెప్పే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌.. ఆచరణలో ఎంత మోసానికి పాల్పడుతున్నదో ఇండ్ల కేటాయింపుల్లో తెలంగాణ పేదల కండ్లలో కారం కొట్టిన ఉదంతమే తాజా నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను కన్నతల్లిలా, తెలంగాణకు సవతితల్లిలా మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్షను కనబరుస్తున్నదని  ఆరోపించారు. ప్రధాన నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రతిసారి రెండు రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామని ఊదరగొట్టడమే తప్ప ఆచరణలో మాత్రం తెలంగాణ ప్రయోజనాలను గాలికొదులుతున్నారని మండిపడ్డారు. పట్టణ పేదల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఐదు రాష్ట్రాల్లోని 66 పట్టణాలకు 2,28,204 ఇండ్లను మంజూరు చేస్తే అందులో

85 శాతం అంటే.. 1,93,147 ఇండ్లను ఒక్క ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికే కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి కేవలం 4.6 శాతం అంటే 10,290 ఇండ్లను కేటాయించడం తెలంగాణపై బీజేపీ ప్రభుత్వానికి నరనరానా పేరుకుపోయిన వ్యతిరేక స్వభావాన్ని చాటుకుంటున్నదని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ పోరాడుతుందని హెచ్చరించారు.