అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ

ఎన్నికల ప్రచారంలో నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా
మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి ): తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు  నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి  పేర్కొన్నారు. గ్రామాల్లో ఆమె సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హావిూని కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మొదలైన ప్రాజక్టులకు రిడిజైన్‌ పేరుతో అంచనా వ్యయంతో పెంచి వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు, ఒక ఇంట్లో ఎందరు అర్హులుంటే వారందరికీ పింఛన్‌ మంజూరు చేస్తోందని తెలిపారు. అంతేగాక పింఛను పెంచుతామన్నారు. నిధులు, నీళ్లు, నియామాకాల కోసం సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలుగా కుటుంబపాలనకే పరిమితమైందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి రైతులు, ప్రజల సమస్యలపై పోరాడిన వ్యక్తినన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వారికి అదనంగా రెండు లక్షలు, ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 50వేల నగదును, ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చూసి నాలుగైదు రాష్ట్రాల బ్జడెట్‌ కావాలని విమర్శించిన టీఆర్‌ఎస్‌ అదే మేనిఫెస్టోను కాపీ కొట్టిందని విమర్శించారు. ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే భారీ మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం కలుగుతోందనిసునీతారెడ్డి అన్నారు. కేసీఆర్‌ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
తలాపున ఉన్న సింగూర్‌ నీటిని అక్రమంగా తరలించుకుపోయి కాళేశ్వరం నీటిని ఇస్తామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని కేసీఆర్‌ కుటుంబానికే దక్కాయని ఎద్దేవా చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ అవినీతికి కేంద్రంగా మారాయని విమర్శించారు.  లక్ష ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 20 వేలతో మెగా డీఎస్‌సీ నిర్వహిస్తామన్నారు.