అధికారంలోకి సీపీఎన్‌(మావోయిస్టు)

3

– ప్రధానిగా ప్రచండ ఎన్నిక

ఖాట్మండు,ఆగస్టు 3(జనంసాక్షి): నేపాల్‌ కొత్త ప్రధానిగా మావోయిస్ట్‌ నేత ప్రచండ ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. 2008లో గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది ప్రభుత్వాలు మారాయి. తాజాగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేక కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌(యూన్గి/డ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌) నాయకుడైన ప్రధాని ఖడ్గ ప్రసాద్‌శర్మ ఓలి రాజీనామా చేశారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌(మావోయిస్టు సెంటర్‌) అధినేత ప్రచండ మద్దతు ఉపసంహరించుకోవడంతో గత నెల 24న ఓలి రాజీనామా చేయక తప్పలేదు. ఈ నేపథ్యంలో నేపాలీ కాంగ్రెస్‌, సహా ఇతర పార్టీల సాయంతో మరోసారి ప్రచండ ప్రధానిగా రాజకీయ పగ్గాలు అందుకున్నారు. 595 మంది సభ్యులు గల నేపాల్‌ పార్లమెంట్‌లో 573 మంది ఓటింగ్‌లో పాల్గొనగా ప్రచండకు 363 ఓట్లు వచ్చాయి. దీంతో నేపాల్‌ 24వ ప్రధానిగా ప్రచండ ప్రమాణం చేయబోతున్నారు. 2008లో గణతంత్ర రాజ్యంగా అవతరించిన తర్వాత ఇప్పటివరకు ఏడుగురు ప్రధానులు మారగా.. ప్రచండ ఎనిమిదో ప్రధాని అయ్యారు. ఇంతకుముందు కేపీ ఓలి ప్రభుత్వానికి ప్రచండ మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆయన పార్లమెంట్‌లో అవిశ్వాసాన్ని ఎదుర్కొనే ముందే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.నేపాల్‌ ప్రధానమంత్రిగా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌కు చెందిన ప్రచండ ఎన్నికయ్యారు.