అధికారం ఇవ్వండి.. అగ్నిపథ్‌ రద్దు చేస్తాం

ఇది సైన్యం పథకం కాదు.. మోడీ పథకం
జవాన్లు (అగ్నివీర్లు) రోజువారీ కూలీలు కాదు..!
దేశ రక్షణను భాజపా ప్రమాదంలోకి నెట్టింది
హర్యాన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు
రైతుల సమస్యలపై ప్రధాని మోడీ వైఖరిపై ఆగ్రహం
చంఢీగడ్‌, మే 22 (జనంసాక్షి):
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేసి చెత్తకుండీలో పడేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. దేశ యువతను కూలీలుగా మార్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నివీర్‌ పథకంపై బిజెపి ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ఇది సైన్యం పథకం కాదని, ఇది మోడీ పథకమని ఆయన ఆరోపించారు. అగ్నివీర్‌ ఫథకాన్ని సైన్యం కోరుకోవడం లేదని ఆయన తెలిపారు. భారతదేశ సరిహద్దులు దేశ యువత చేతుల్లో భద్రంగా ఉన్నాయని, మన యువత డిఎన్‌ఎలోనే దేశభక్తి ఉందని ఆయన అన్నారు. భారతదేశ యువతను కూలీలుగా మోడీ మార్చివేశారని ఆయన ఆరోపించారు. హర్యానాలో తన తొలి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మహేంద్రగఢ్‌లో ప్రారంభించిన రాహుల్‌ గాంధీ రైతుల సమస్యపై ప్రధాని మోడీ వైఖరిని ఎండగట్టారు. రెండు రకాల అమర జవాన్లు ఉంటారని మన ప్రభుత్వం చెబుతోందని, ఒకరు సాధారణ జవాన్‌ అయితే మరొకరు పెన్షన్‌, అమర వీరుని హోదా, ఇతర అన్ని సౌకర్యాలు లభించే అధికారి అని రాహుల్‌ చెప్పారు. అగ్నివీర్‌ పేరుతో సైన్యంలోకి వచ్చే పేద కుటుంబానికి చెందిన వ్యక్తి మరణిస్తే అమర వీరుని హోదా కాని, పెన్షన్‌ కాని రావని, కనీసం క్యాంటీన్‌ సౌకర్యం కూడా ఉండదని ఆయన తెలిపారు.
రైతులు కష్టం తెలియదా?
హరియాణ రైతులు పొలాల్లో కష్టపడుతున్నారని, కానీ మోదీ ప్రభుత్వం బిలియనీర్లకు సాయం చేసేలా ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ బిల్‌ను రద్దుచేసి రైతుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. మూడు వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిందని, దీనిపై భారత్‌ జోడో యాత్రలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మీడియాలో ఎక్కడా కనిపించలేదని అన్నారు. 22 మంది కోటీశ్వరులకు చెందిన రూ. 16 లక్షల కోట్ల రుణాలను మోడీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆయన ఆరోపించారు. జూన్‌ 4న తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ మాఫీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. వేల కిలోమీటర్ల మేర ‘భారత్‌ జోడో యాత్ర’ చేశాను, వెళ్ళిన ప్రతి చోట అక్కడ ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మోడీ రైతుల సమస్యలు, ఉద్యోగాలు గురించి మాట్లాడరని రాహుల్‌ ప్రధానిపై విమర్శలు చేశారు.