అధికారమివ్వండి..అభివృద్ధి చేస్తాం

2

– మోదీ

బిజెపికి అధికారం అప్పగిస్తే అభివృద్ది చేస్తాం: మోడీ

అలహాబాద్‌,జూన్‌13(ఆర్‌ఎన్‌ఎ): అభివృద్ది కేవలం బిజెపి వల్లనే సాధ్యమని, వచ్చే యూపి ఎన్నికల్లో బిజెపిని గెలిపించి అభివృద్దికి పునాది వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అవినీతి, గూండాయిజాన్ని అంతమొందిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూపీలోని అలహాబాద్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన భాజపా పరివర్తన్‌ ర్యాలీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలు నిర్వహించిన అన్ని చోట్లా తాము బాగా పనిచేశామన్నారు. ప్రముఖ నేతలంతా యూపీ నుంచే వచ్చారని, ఈ నేల గంగా, యమున, సరస్వతి ప్రవహించిన పవిత్ర త్రివేణి సంగమమని వ్యాఖ్యానించారు. గంగానది ఇక్కడి ప్రజల్లో కొత్త చైతన్యం, ఉత్తేజాన్ని నింపిందన్నారు. ఉత్తర్‌ప్రదేలో వికాస్‌ యజ్ఞం ప్రారంభం కాబోతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ గురించే చర్చ జరుగుతోందని, ఆ ఘనత యూపీ ప్రజలకే దక్కుతుందని చెప్పారు. యూపీలో బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం రాజ్యమేలుతున్నాయని, నేర ప్రవృత్తి విపరీతంగా పెరుగుతోందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతతత్వం, నిరంకుశ పాలన, అవినీతి రూపుమాపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దుష్టశక్తులను తరిమేందుకు అభివృద్ధి మంత్రమే తరుణోపాయమన్నారు. అభివృద్ధి జరగకపోతే యువతకు ఉపాధి అవకాశాలు ఎలా లభిస్తాయని ప్రశ్నించారు. మూడు, నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో ఇంటర్వ్యూలను తొలగించామన్నారు. పరివర్తన్‌ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి అధికారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తూ అధికారం ఇచ్చాక ప్రజలకు నష్టం కలిగిస్తే తమను తన్ని తరిమెయ్యాలన్నారు. మాయావతి, ములాయం తోడు దొంగల్లా వ్యవహరిస్తూ చెరి ఐదేళ్లు పాలిస్తూ రాష్టాన్ని దోచుకున్నారని చెప్పారు. మాయావతి, ములాయంల నుంచి ఉత్తరప్రదేశ్‌కు విముక్తి కల్పించి బిజెపికి పట్టం కట్టాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌ను ఐదేళ్లలో అభివృద్ధి బాట పట్టిస్తానన్నారు. యూపీ అభివృద్ధి చెందితే భారత్‌ ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ అవుతుందని తెలిపారు.  పరివర్తన్‌ ర్యాలీలో భాజపా అగ్రనేత ఎల్‌.కె. అడ్వాణీ సహా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, ఉమాభారతి, భాజపా పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భాజపా శ్రేణులతో పాటు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. యూపీలోని అలహాబాద్‌లో బీజేపీ నిర్వహించిన పరివర్తన్‌ ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు.