అధికారికంగా క్రిస్‌మస్ వేడుకలు
– సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి):క్రైస్తవులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వచ్చే క్రిస్ మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. క్రిస్ మస్ సందర్భంగా రాష్ట్రంలోని 2 లక్షల మంది నిరుపేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 20న వారికి విందు ఇవ్వనున్నారు. హైదరాబాద్ లో 100 చర్చిల్లో, రాష్ట్రంలోని 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విందు భోజనం పెట్టనున్నారు. 195 చోట్ల వెయ్యిమందికి చొప్పున దుస్తులు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారికంగా క్రిస్ మస్ వేడుకల నిర్వహణపై హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి సవిూక్ష జరిపారు. కార్యక్రమ నిర్వహణపై రేమండ్ పీటర్, ఏకే ఖాన్ సమన్వయంలో త్వరలోనే క్రైస్తవ మతపెద్దలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలకు సముచిత గౌరవం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మైనార్టీల కోసం వచ్చే విద్యాసంవత్సరం నుంచి 60 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెలలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ మెస్ చార్జీలు రూ.7 కోట్ల విడుదలకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2005-14 వరకు బకాయిలు మొత్తం ఒకేసారి చెల్లించాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని కాలేజీ, యూనివర్సిటీల్లో హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ లో హాస్టళ్లకు సన్నబియ్యం కోసం నిధులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో భోజనానికి, మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.700 కోట్లు వెచ్చిస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్టడీ సెంటర్ల ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రూప్ పరీక్షలతో పాటు జీఆర్‌ఈ, టోఫెల్ పరీక్షలకు, దేశవ్యాప్తంగా జరిగే ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. విదేశాల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం అందిస్తున్న సాయంపై విస్త్రృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. సమాజంలోని వెనుకబడిన కుటుంబాలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ ఏకే ఖాన్, మైనార్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ హాజరయ్యారు. క్రిస్ మస్ సందర్భంగా క్రైస్తవులకు వరాలు ఇస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల క్రైస్తవ, మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు జాకబ్ రాస్ హర్షం ప్రకటించారు.
పేద క్రైస్తవులకు బట్టలు, భోజనం కోసం ఏర్పాట్లు
డిసెంబర్ 20న క్రైస్తవులకు విందు భోజనం పెట్టాలని తెలిపారు. హైదరాబాద్‌లో వంద చర్చిల్లో రాష్ట్రంలోని 95 నియోజకవర్గాల్లో విందు భోజనం ఉంటుందని పేర్కొన్నారు. 2 లక్షల మంది నిరుపేద క్రైస్తవులకు నూతన దుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. 195 చోట్ల వెయ్యి మంది చొప్పున దుస్తులు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణపై రేమండ్ పీటర్, ఏకే ఖాన్ సమన్వయంలో త్వరలోనే క్రైస్తవ మతపెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మైనార్టీలకు 60 గురుకుల పాఠశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. సమాజంలో అన్ని వర్గాలకు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.