అధికారికంగా సర్వాయిపాపన్న జయంతి
మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి
కరీంనగర్,అగస్టు4(జనం సాక్షి): బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం ప్రకటనను స్వాగతిస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో.. కరీంనగర్ తెలంగాణ చౌకు వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సబ్బండ వర్ణాల సంక్షేమానికి పోరాడిన సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత 30 సంవత్సరాలుగా బహుజనులు పోరాడుతున్నారు. కానీ, సమైక్య పాలనలో పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు నాటి పాలకులకు మనసు రాలేదని విమర్శించారు. కానీ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు