పెట్రోలియం నిల్వలు సమద్ధిగా ఉన్నాయి

` దేశంలో ఇంధనానికి కొరత లేదు..
` 60 రోజులకు సరిపడా స్టాక్
` ప్రజలు ఆందోళన చెందొద్దు:కేంద్రం
న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. 60 రోజులకు సరిపడా స్టాక్ ఉందని తెలిపింది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీకి కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేసింది. తప్పుదోవ పట్టించేలా ప్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా ఉన్నట్లుండి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుతీరుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.ప్రపంచంలోనే భారత్ నాలుగో అతిపెద్ద రిఫైనర్ అని, ఐదో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఉందని కేంద్రం పేర్కొంది. దేశీయంగా తగినంత సరఫరా కలిగి ఉండడమే కాకుండా.. 150కి పైగా దేశాలకు శుద్ధి చేసిన ఇంధనాలను సరఫరా చేస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది. దేశంలో ప్రతి రిఫైనరీ నూరు శాతం ఉత్పత్తాదక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది.దేశంలో తదుపరి 60 రోజులకు సరిపడా క్రూడాయిల్ చమురు కంపెనీల వద్ద ఉందని కేంద్రం తెలిపింది. వ్యూహాత్మక నిల్వలతో కలిపి 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమై 27వ రోజులు మాత్రమే అయ్యిందని గుర్తుచేసింది. భౌగోళిక పరిణామాలతో సంబంధం లేకుండా రాబోయే రెండు నెలల పాటు స్థిరంగా చమురు సరఫరా చేయడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేసింది.అలాగే, దేశీయంగా ఎల్‌పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. దేశీయంగా ఉత్పత్తి పెంచామని, తద్వారా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా తగ్గిందని తెలిపింది. ఎల్‌పీజీకి కొరత రాకుండా ఉండేందుకు పలు దేశాల నుంచి కార్గోలను తెప్పిస్తున్నామని వెల్లడించింది. ఇంధనం విషయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు, కల్పిత ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.