అధికారులు గురుకులాలను సొంత ఇంటిలా చూసుకోవాలి.

 వికారాబాద్ జిల్లా పాలనాధికారి నిఖిల
 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి సెప్టెంబర్30.
    గురుకులాలను స్వంత ఇంటిలా .. అందులో విద్యను అభ్యసించే పిల్లల్ని మన పిల్లలుగా భావించి పనిచేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ నిఖిల ఉద్భోదించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో వివిధ విభాగాల గురుకుల పాఠశాలలు,  కేజీబీవీ,  ఆదర్శ పాఠశాలలు,  సంక్షేమ వసతి గృహాల సిబ్బందికి సెప్టెంబర్ 27 నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వసతి గ్రహాల్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని రకాల వసూలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.  పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు  పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.   అధికారులు నామమాత్రంగా కాకుండా మంచి సంకల్పం, సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.  విద్యార్థులు భోజనాలు చేసే ప్రాంతాలు, టాయిలెట్స్, బట్టలు ఉత్తుకునే స్థలాలు,  వెంటిలేషన్స్ శుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. అధికారులు జాబ్ చార్ట్ కు అనుకూలంగా పనిచేయాలని  సూచిస్తూ.. విద్యార్థులు ఆరోగ్యపరంగా బాగుండేందుకు యోగ , శారీరక వ్యాయామంపై కూడా దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు.  తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు అదేవిధంగా నిర్దేశించబడ్డ సమయాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రిన్సిపాల్స్ కు కలెక్టర్ సూచించారు. చదువులో వెనుక పడుతున్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆమె తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల సలహాలు కూడా తీసుకొని పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పాఠశాలలో విద్యతోపాటు,  విద్యార్థుల అభీష్టం మేరకు వివిధ ఆసక్తి గల కార్యక్రమాలను తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహాలు అక్టోబరు  6,  7 తేదీలలోపు పరిశుభ్ర ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న నీటిని శుద్ధి చేసే ఆర్.ఓ. ప్లాంట్లను పరిశుభ్రం చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  ప్రైవేటు భవనాల్లో ఉన్న వసతి గృహాలు / పాఠశాలల మరమ్మత్తు పనులను యజమానులకు తెలియజేసి సరి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భవనాల్లో చిన్నచిన్న మరమ్మతులు ఉంటే చేయించాలని అదేవిధంగా మేజర్ సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించి కావలసిన నిధులకై అంచనాలను సమర్పించాలని  కలెక్టర్ తెలిపారు.   జిల్లా అధికారులతో కలిసి తానే స్వయంగా వచ్చి వసతి గృహాలను తనిఖీ చేస్తానని కలెక్టర్ తెలిపారు.
      ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం,  గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి, మైనార్టీ అభివృద్ధి అధికారి సంధ్యారాణి, ఎంజెపిటిబిసి జిల్లా అధికారి శంకర్,  సాంఘిక సంక్షేమ డిఈఓ అపర్ణ, సెక్టోరల్ అధికారి యాసిమ్, వివిధ వసతి గృహాల/పాఠశాలల ప్రిన్సిపల్స్, సిబ్బంది పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail