అధికారుల సమన్వయంతో ఆగస్టు 15 నిర్వహించాలి: పి. శేషాద్రి
వరంగల్, ఆగస్టు 2 : జిల్లా ప్రధానకేంద్రంలో ఈ నెల 15న జరగనున్న భారతదేశ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ పి.శేషాద్రి కోరారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల నిర్వహణకు బందోబస్తు ఏర్పాటు చేయాలని, విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ వేడుకలు నిర్వహించే ప్రాంతం శుభ్రంగా ఉండేటట్లు, త్రాగునీటి సరఫరా చేయాలని, విద్యుత్ సరఫరా, అవసరమయితే ప్రత్యామ్నాయంగా జనరేటర్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. ప్రాజెక్టు సంచాలకులు, డి.ఆర్.డి.ఎ., డ్వామా, గృహ నిర్మాణం, మైక్రో ఇరిగేషన్, ప్రాజెక్టు అధికారి, ఇ.టి.డి.ఏ, ఆర్.వి.యం.లతో పాటు సంయుక్త సంచాలకులు వ్యవసాయ పశుసంరక్షణ శాఖ, జిల్లా పర్యాటక శాకాధికారి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు వారి శాఖల ప్రగతిని వివరించే శకటాల ప్రదర్శన వేడుకలలో నిర్వహించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో శ్రీకాంత్‌లతో పాటు, వివిధ శాకల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.