అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుకు పాలమాకుల గ్రామం ఎంపిక
నంగునూరు, జూన్21(జనంసాక్షి):
మండలంలోని పాలమాకుల గ్రామాన్ని అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానానికి ఎంపిక చేశారు. ఈ గ్రామంలోని రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేయడం వలన ఇదే గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని మండల వ్యవసాయ విస్తరణ అధికారిణి గీత తెలిపారు. ఈ సీజన్లో రాష్ట్రమంతటా 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పైలట్ ప్రాజెక్టు కింద హై డెన్సిటి విధానంలో పత్తి సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం రోజున పాలమాకుల రైతు వేదికలో రైతులకు నూతన పత్తి వంగడాల విత్తనాలు అందజేశారు.ఇక్కడి రైతులు తొలుత 50 ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయబోతున్నారు. సాధారణ పద్ధతిలో కన్నా హై డెన్సిటి విధానంలో అధిక దిగుబడులు వస్తాయని, ఒక ఎకరాకు 2.5 కిలోల విత్తనాలు అవసరం ఉంటాయని గీత తెలిపారు.
అధిక సాంద్రత పత్తి సాగుకు అనువైన రకాలు వాటి గుణగణాలు
మొక్క ఎత్తు 3 ఫీట్లు మాత్రమే ఉండాలి. ఒక్కో మొక్కకు 10-15 కాయలు ఉండాలి. కాయ బరువు 4-5 గ్రా. ఉండాలి. మొక్కలోని అన్ని కాయలు చీడపీడల నుంచి తట్టుకొననే సామర్థ్యం ఉండాలి. అన్ని ఒకేసారి పరిపక్వానికి రావాలి. 140-150 రోజుల్లో పంట చేతికి రావాలి 90×15సెం.మీ ఎడంలో విత్తితే 29630 మొక్కలు, 80×20సెం.మీ ఎడంలో విత్తితే 25,000 మొక్కలు వస్తాయని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంగ కుమారస్వామి, ఉప సర్పంచ్ ఓజయ్య, మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, మండల రైతు బంధు అధ్యక్షుడు బద్దీపడగ కిష్టారెడ్డి, గ్రామ రైతు బంధు అధ్యక్షులు వేల్పుల ఐలయ్య, గుండెల్లి రాజయ్య, మండల వ్యవసాయ విస్తరణ అధికారిని గీత, వ్యవసాయ విస్తరణ అధికారులు అశోక్, ప్రేమ్ సాగర్ మరియు గ్రామ రైతులు ఉన్నారు.