అధిష్టానానికి భయపడి అస్త్రసన్యాసం
హైదరాబాద్,జూలై 17(జనంసాక్షి): తెలంగాణ ఎంపీలు మళ్లీ అధిష్టానానికి భయపడ్డారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్రపతి ఎన్నిక సమయంలో వీళ్ల మాట్లాడుతారని, తెలంగాణపై స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు ఎన్నికలో పాల్గొనేది, లేనిది చెప్పరని ఆశించిన తెలంగాణవాదుల ఆశలకు గండికొట్టారు. ఎలాంటి డిమాండు లేకుండానే రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ బలపర్చిన ప్రణబ్ ముఖర్జీకే ఓటు వేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికపై పార్టీ వ్యూహాన్ని వివరించేందుకు మంగళవారం సోనియాగాంధీ రాష్ట్ర ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీ ఎంపీలందరూ ప్రణబ్ ముఖర్జీకే ఓటేయాలని ఆదేశించారు. తొలి ప్రాధాన్యత ఓటును ప్రణబ్‌కు వేయాలని, రెండో ప్రాధాన్యత ఓటును వినియోగించుకోవద్దని సోనియా ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నిక తప్ప తెలంగాణతోపాటు మిగతా అంశాలపై ఎలాంటి చర్చ జరుగలేదని ఎంపీలు కనుమూరి బాపిరాజు, సర్వే సత్యనారాయణ తేల్చి చెప్పారు. సమావేశం అనంతరం తెలంగాణ ఎంపీలు మాట్లాడుతూ మళ్లీ పాత పాటే పాడారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసం తమకు బలంగా ఉందని వివరించారు. అందుకే, తాము ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, కోమటిరెడ్డి రాజమోహన్‌రెడ్డి తదితర ఎంపీలు స్పష్ట చేశారు. సోనియాతో జరిగింది చిన్న సమావేశమే కాబట్టి తాము తెలంగాణ అంశాన్ని లేవనెత్తలేదని ఎంపీ మందా జగన్నాథం తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సమావేశం తర్వాత సోనియాతో విడిగా భేటీ అయిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నిక తరువాత అధిష్టానం తెలంగాణపై అనుకూల ప్రకటన చేస్తుందని తాను భావించడం లేదని పేర్కొన్నారు. అయితే, తెలంగాణవాదులు మాత్రం టీఎంపీల నిర్ణయంపై మండిపడుతున్నారు. సోనియాతో భేటీ అయిన ప్రతి క్షణాన్ని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకోవాలన్న సంగతిని టీఎంపీలు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇక ఎంపీలను నమ్మరని విమర్శించారు. ఎప్పుడు అవకాశం వచ్చినా తెలంగాణ ఎంపీలు వాడుకోకుండా, అధిష్టానానికి భయపడి మోకరిల్లుతున్నారని ఆరోపించారు.