అనురాగ్‌ కశ్యప్‌పై శత్రుఘ్నసిన్హా ఫైర్‌



new-copy
ముంబయి: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేసిన బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై అలనాటి నటుడు, భాజపా ఎంపీ శతృఘ్నసిన్హా మండిపడ్డారు. కరణ్‌ సినిమాకి.. మోదీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. పాక్‌లో పర్యటించినందుకు మోదీ క్షమాపణ చెప్పాలని… ఆయన్ని ప్రశ్నించే హక్కు తనకి ఉందంటూ అనురాగ్‌ కశ్యప్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పాక్‌ నటుల సినిమాలు బ్యాన్‌ చేయాలని ఎమ్‌ఎన్‌ఎస్‌ హెచ్చరికలు జారీచేయడంతో… కరణ్‌జోహార్‌ తెరకెక్కించిన ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ చిక్కుల్లో పడింది. దీనిపై స్పందించిన అనురాగ్‌ కశ్యప్‌.. కరణ్‌ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే మోదీ పాక్‌ వెళ్లారని… అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.దీనిపై శతృఘ్న స్పందిస్తూ.. ‘నేను ఈ విషయంపై మాట్లాడే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకు అనురాగ్‌, అతని సోదరుడు అభినవ్‌ చాలా ఇష్టం. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎంతో ఇష్టం, గౌరవం. భారత్‌-పాక్‌ మధ్య శాంతి సామరస్యం నెలకొల్పడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోదీని తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదు. ఇప్పుడు మోదీని విమర్శిస్తున్న వారు రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. నిన్నటి ప్రాణ స్నేహితులు రేపు బద్ధ శత్రువులు అవ్వొచ్చు. దేశమంతా అభినందించిన మోదీ పాక్‌ పర్యటనని రాజకీయం చేయొద్దు. కరణ్‌ జోహార్‌ సినిమాకి.. మోదీ పాక్‌ పర్యటనకు, కరణ్‌కి అనురాగ్‌కి అసలు సంబంధం ఏంటో నాకు తెలియడం లేదు.’ అని అన్నారు.