అన్నదాతల కష్టాలు తెలిసిన వ్యక్తి కెసిఆర్‌

అందుకే రైతు పథకాలకు ఆదరణ: ఎమ్మెల్యే
సిద్దిపేట,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): అన్నదాతల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసుననీ, అందుకే వారికి వివిధ రకాల సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేస్తూ రైతు బంధువుగా నిలిచారనీ దు బ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కొనియాడారు. కేంద్రంలో సంకీర్ణ యుగం రాబోతున్నదని పేర్కొన్నారు. కెసిఆర్‌ కీలక భూమిక పోషించడం ఖాయమని అన్నారు. తెలంగాణపై ప్రేమతో ఆంధ్రా నుంచి కరెంట్‌ ఇస్తున్నామనీ, తెలంగాణ వస్తే కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకుంటారని ఆనాటి చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. రైతుల గురించి ఏ ప్రభుత్వాలూ ఆలోచన చేయలేదనీ, కేసీఆర్‌ నాయకత్వంలో కోట్లాడి సాధించిన తెలంగాణలో రైతుల సమస్యలు తీర్చేందుకే రైతు బంధు, రైతు బీమా పథకాల కేసీఆర్‌ అమలు చేస్తున్నారని చెప్పారు.  24గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రిలో రెండు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారనీ, ఇక త్వరలోనే ఇతర రాష్ట్రాలకు కరెంటు అమ్మే రోజులు వస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి రూ.2వేలు ఇస్తారనీ, చెప్పిన హావిూలతోపాటు చెప్పని పనులనూ కేసీఆర్‌ చేశారని పేర్కొన్నారు. నరేంద్రమోడీ చెప్పుకునేందుకు ఒక్క పని కూడా చేయలేదనీ చెప్పారు. మున్ముందు చదువు, వైద్యం ఖర్చులపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది వివరించారు. కేసీఆర్‌ చేస్తున్న పనిలో స్పష్టత ఉంది కాబట్టే ప్రజలు గుర్తించి ఓటు వేసి గెలిపించారని గుర్తుచేశారు.