అన్నయ్యకు వ్యతిరేకంగా కాదు: ప్రహ్లాద్ మోదీ

అన్నయ్యకు వ్యతిరేకంగా కాదు: ప్రహ్లాద్ మోదీ

ముంబై:   కేంద్ర ప్రభుత్వానికి  వ్యతిరేకంగా  ముంబై లో జరుగుతున్న ఓ ఉద్యమంలో  ప్రధాని  నరేంద్ర మోదీ సోదరుడు  ప్రహ్లాద్ మోదీ ప్రధాన  ఆకర్షణగా నిలిచారు.  స్థానిక  అజాద్ మైదాన్ లో జరిగిన  చౌక ధరల దుకాణదారుల ఉద్యమంలో ఆయన  ప్రసంగించి సంచలనం సృష్టించారు.  అఖిల భారత చౌకధరల దుకాణదారుల జాతీయ  ఉపాధ్యక్షుడుగా  ఉన్న ప్రహ్లాద్ మోదీ తమ ఉద్యమం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే తప్ప,  తన సోదరుడు  మోదీకి వ్యతిరేకంగా కాదంటూ చాలా జాగ్రత్తగా  మాట్లాడారు.

తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే బీహార్,  ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటమి తప్పదని ప్రహ్లాద్ మోదీ హెచ్చరించారు.  ఈ సందర్భంగా  ప్రభుత్వ ఉద్యోగులపై ఆయన విరుచుకుపడ్డారు. వాళ్లు పెద్ద దొంగలుంటూ వ్యాఖ్యానించిన ఆయన… రేషన్ డీలర్లు కూడా అనివార్యంగా దొంగలుగా మారాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారని ప్రహ్లాద్ మోదీ ఆరోపించారు.
దాదాపు నలభై అయిదు నిమిషాలపాటు సాగిన ఆయన ప్రసంగంలో ఎక్కడా మోదీపై విమర్శ లేకుండా  చాలా చాకచక్యంగా మాట్లాడారు.   పనిలో  పనిగా గత  యూపీయే ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు.  తమ పోరాటం వ్యక్తుల మీద కాదు.. వ్యవస్థ మీదంటూ పదే పదే నొక్కి వక్కాణించారు. తమ అన్నదమ్ముల మధ్య పుల్లలు పెట్టేందుకు మీడియా చూస్తోందంటూ కామెంట్ చేయడం కొసమెరుపు.