అన్నా నేతృత్వంలో కొత్త వేదిక
‘జనతంత్ర మోర్చా’ ఆవిర్భావం
పాట్నా : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాజ్యంగ పరమైన సంస్థల స్వయం వికాసం, అవినీతి అంతమే లక్ష్యంగా జనతంత్ర మోర్చా ఏర్పాటు చేస్తున్నట్లు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే తెలిపారు. బుధవారం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడారు. పార్లమెంటరీ వ్యవస్థ మితిమీరిన జోక్యంతో రాజ్యాంగబద్ధమైన సంస్థలు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనలో పారదర్శకత, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ బలోపేతం, గ్రామీణ పరిపాలన వ్యవస్థల సమగ్ర
వికాసమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిని యూనిట్‌గా చేసుకొని వీటిపై విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామ సభల నిర్వహణ, ఉద్యోగ అవకాశాల సృష్టి, గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పన కోసం గ్రామం, బ్లాక్, జిల్లా స్థాయిల్లో నిర్వహణ సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల హక్కులు, నిరుపేదలకు ఆహార భద్రత, విద్యా, యువజన పాలసీ ఏర్పాటు, నల్లధనం వెలికితీతపై శాసన వేదికలను ఉపయోగించుకొని పోరాడుతామన్నారు.