అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న!

Organ-donationఅవయవదాన దినోత్సవం రాగానే ఒక మాట వినిపిస్తుంది.. అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న అని. మంచిమాటే కానీ అదొక అందమైన నినాదంగా మిగిలిపోవడమే బాధాకరం. దేశంలో ఏటా అయిదు లక్షల మంది అవయవ దాతలు దొరక్క మరణిస్తున్నారు. వీరిలో మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నవారు రెండు లక్షల పైనే ఉంటారు. మరో 50 వేలమంది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. కంటి సమస్యలున్న మరో లక్షమంది దాకా ఉంటారు. నేత్రదానం చేసేవారు దొరక్క వారంతా అంధత్వంలో మగ్గిపోతున్నారు. ఇవన్నీ అధికారిక గణాంకాలు. అనధికారికంగా చనిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. వీటన్నిటికీ కారణం అవయవదానంపై ప్రజల్లో చైతన్యం లేకపోవడమే. ఎవరో కొంతమంది సంపన్ను వర్గాలు ఏదో ఒక దారిలో ప్రాణగండం నుంచి బయటపడుతుంటారు. ఎటొచ్చీ సామాన్య ప్రజలే దాతల్లేక జీవచ్ఛవాలుగా మారుతున్నారు. స్పెయిన్‌లో ప్రతి 10లక్షల మందికి 35 మంది అవయవదాతలు ఉన్నారు. బ్రిటన్‌లో 27మంది, కెనడాలో 14 మంది, ఆస్ట్రేలియాలో 11మంది దాతలు ఉంటే, మనదేశంలో ఆ సంఖ్య 0.16 మాత్రమే!

కేంద్రం 1994లో మానవ అవయవాల మార్పిడి చట్టం తెచ్చింది. కానీ అది సమర్ధవంతంగా అమలు కావడానికి ఏళ్లు పట్టింది. రాష్ట్రంలో 2012, జూన్‌లో మొదలైంది. అయిఏ సంస్థ ప్రారంభమైన ఆరు నెలల వరకు ఒక్క అవయవదాత కూడా ముందుకు రాలేదు. జనాల్లో ఉన్న అపోహను, మూఢనమ్మకాలను పోగొట్టేందుకు జీవన్‌దాన్ ఆరు నెలలు శ్రమించింది. అలా 2013, జనవరి 13న మొట్టమొదటిసారిగా చెన్నైకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి తన అవయవాలను దానం చేశాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అవడంతో అతని కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో మొదటిసారిగా జీవన్‌దాన్ గుండె, రెండు కిడ్నీలు, కాలేయం తీసుకుని నలుగురికి అవయవాల మార్పిడి చేసింది. 2013లో 41 మంది అవయవ దానం చేస్తే 188 మందికి పునర్జన్మ దొరికింది. 2014 లో 51 మంది ఆర్గాన్స్ డొనేట్ చేయగా 232 మంది బాగుపడ్డారు. 2015లో 89 మంది అవయవాలు దానం చేయగా 366 ఆర్గాన్స్ పలువురికి అమర్చారు. 2016లో ఇప్పటి వరకు 62 మంది డొనేట్ చేస్తే 256 అవయవాలు అమర్చారు. ఆ లిస్టులో కిడ్నీలు 422, లివర్లు 235, గుండెలు 26, హార్ట్‌ వాల్వులు 164, కళ్లు 185, లంగ్స్‌ 5 ఉన్నాయి.

అవయవాల సేకరణ, మార్పిడి అనుకున్నంత ఈజీ కాదు. ఈ విషయంలో జీవన్‌దాన్ పాత్ర ఎంతో కీలకమైంది. అవయవాల మార్పిడి, బ్రెయిన్‌డెడ్ ధ్రువీకరణకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జీవన్‌దాన్‌లో తమ ఆసుపత్రుల పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న ఆసుపత్రులకు మాత్రమే సంస్థ ప్రతినిధులు అవయవాల సమాచారాన్ని ఇస్తారు. అయితే అవయవ మార్పిడి విషయంలోనే కాక, సజీవ దాతలనుంచి అవయవాలు తీసుకోవడంలోనూ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కిడ్నీ రాకెట్ గురించి నిత్యం వార్తల్లో చూస్తునే ఉన్నాం. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన అవయవాలు తీసుకోవడమూ పెద్ద సవాలే. మృతుడి కుటుంబ సభ్యులకు సరైన కౌన్సెలింగ్‌ ఇచ్చేవారు లేరు. ఇదంతా ఒక్క జీవన్‌దాన్‌ సంస్థ పని కాదు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కలిసి జనాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి. అనేక విషయాల్లో పాశ్చాత్య పోకడలను ఫాలో అయ్యే భారతీయులు అవయవదానం విషయంలో మాత్రం ఎక్కడో వెనకబడి ఉన్నారు. వెస్ట్రన్ కంట్రీస్ లో 70నుంచి 80 శాతం ప్రజలు అవయవ దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. భారత్‌లో మాత్రం ప్రతి రెండువేల మందిలో ముగ్గురు మాత్రమే ఆ దిశగా కదులుతున్నారు. అపోహలు తొలగిస్తే తప్ప ప్రజల్లో చైతన్యం సాధ్యం కాదు. మరణానంతరం కూడా మనిషి జీవించడమనే అద్భుత శాస్త్రీయ ఆవిష్కారాలను మానవీయ కోణంలో ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.