అన్ని పార్టీల్లోనూ పరిషత్ వేడి
పోటీ కోసం ఆశావహుల సందడి
టిఆర్‌ఎస్‌లో పెరుగుతున్న పోటీ
కాంగ్రెస్, బిజెపిలు కూడా పోరాటానికి రెడీ
ఆదిలాబాద్,ఏప్రిల్17(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలుగా విడిపోవడంతో ఇప్పుడు అందరికీ పదవులపై ఆశలు పెరిగాయి. ఎంపిటిసి నుంచి జడ్పీటిసి, జడ్పీ పీఠం వరకు అంత కన్నేశారు. అధికార టిఆర్‌ఎస్‌లో ఈ పోటీ సహజంగానే ఎక్కువగా ఉంది. ఇకపోతే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తెరాస జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఇతర చోట్ల ఛైర్మన్ అభ్యర్థులెవరనేది పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నాలుగు జిల్లాలుగా ఆవిర్భవించడంతో నాలుగు జడ్పీ ఛైర్మన్ పదవులు ఏర్పడడంతో ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు.
నాలుగు చేజిక్కించుకునేలా తెరాస మ్మడి జిల్లాలోని నాలుగు జడ్పీఛైర్మన్ పదవులు చేజిక్కించుకునేందుకు తెరాస పావులు కదుపుతోంది. పదిచోట్ల తెరాస ఎమ్మెల్యేలే ఉండడంతో తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాల వారిగా ఇంఛార్జి బాధ్యతలు అప్పగించింది. నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బాధ్యత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్నకు బాధ్యతలిచ్చారు. ఎస్టీ మహిళకు రిజర్వైన కుమురంభీం ఆసిఫాబాద్ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ పేరును ఆ జిల్లాకు జడ్పీఛైర్‌పర్సన్ అభ్యర్థిగా సీఎం ప్రకటించడంతో మిగితా మూడు జిల్లాలో అభ్యర్థులు ఎవరనే చర్చ మొదలయ్యింది. జనరల్ మహిళకు రిజర్వు అయిన నిర్మల్ జడ్పీచైర్‌పర్సన్ పదవి కోసం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న శోభారాణి పేరు వినవస్తోంది. ఇటు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోడలు దివ్యారెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. మిగితా ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది స్పష్టమైందని ఆ పార్టీ నేతల వాదన. దీంతోనే జడ్పీటీసీ,
ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తాచాటేందుకు ఎత్తుగడలు వేసేలా పార్టీనేతలు చర్చిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాల వారీగా సమన్వయం చేసేందుకు ఇన్‌ఛార్జిలను నియమించింది. ఆదిలాబాద్‌కు ప్రేమలతా అగర్వాల్, కుమురంభీం ఆసిఫాబాద్‌కు బి.జనక్‌ప్రసాద్, మంచిర్యాలకు నమిండ్ల శ్రీనివాస్, నిర్మల్‌కు అల్లం భాస్కర్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. వీరు స్థానిక డీసీసీ అధ్యక్షులు సహకారంతో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సర్వే ఏజెన్సీల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నాయకులు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌పాండే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఆశావహుల పేర్లు తెప్పించుకొని రెండు పేర్లున్నచోట ఎవరు బలమైన వారనేది తేల్చే పనిలో పడ్డారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి సర్వేలే చేయించనున్నట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పుంజుకునేందుకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయని భావిస్తోంది. దీంతోనే అభ్యర్థులకు అవసరమరైతే ఖర్చులకు నిధులు కూడా ఇచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న భాజపా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 66 జడ్పీటీసీలు, 567 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పార్టీ అధిష్ఠానం అన్ని స్థానాల్లో పోటీకి నిర్ణయించింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో భాజపాకు అమితాదరణ లభించిందని పార్టీ అంచనా. దీంతోనే ఇదే ఊపుతో పరిషత్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో విజయం సాధించవచ్చేనది పార్టీ ఆలోచన. అందుకనే మొత్తం స్థానాల్లో అభ్యర్థులను దించేందుకు పేర్ల సేకరణ మొదలెట్టింది. మొత్తంగా అన్‌ఇన పార్టీల్లోనూ ఆశావహులు ముందుకు వస్తున్నారు. తమకే టిక్కెట్ అంటూ సాగుతున్నారు.