అప్పుడెందుకు మోత్కుపల్లి నోరు మెదపలేదు?
– గవర్నర్, రాజ్యసభ పదవులు లేకపోయేసరికి విమర్శలా?
– దళితుల సంక్షేమానికి పాటుపడింది తెదేపానే
– మోత్కుపల్లి వెనక శక్తులేవో దళితులకు తెలుసు
– వారే తగిన గుణపాఠం చెబుతారు
– ఏపీ మంత్రి కేఎస్ జవహర్
అమరావతి,మే29(జనం సాక్షి): మోత్కుపల్లి వ్యాఖ్యలు తల్లిపాలు తాగి తల్లిరొమ్మునే గుద్దినట్లుగా ఉన్నాయని, తన స్వలాభంకోసం చంద్రబాబుపై అసత్యప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. ఏడ్చే రాజకయచీ నాయకుడిని ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. మోత్కుపల్లి ఏడిస్తే ప్రజలు నమ్ముతారని అనుకోవడం అవివేకమని అన్నారు. మంగళవారం మహానాడులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రియ శిష్యుడినని ప్రకటించుకుని ఇప్పుడిలా పార్టీని విమర్శించటం సరికాదన్నారు. ఇన్నాళ్లూ ఒక్క మాటా చెప్పకుండా, అనుభవించు రాజా అన్న రీతిలో ఉండి ఇప్పుడు విమర్వలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీని విమర్శిస్తూ.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జీవో నంబరు 25ను అమలు చేసి దళితులను పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ విషయాలేవి మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. మాదిగల సంక్షేమం గురించి ఇప్పుడు మాట్లాడతున్న మోత్కుపల్లి మరి నాడు మందకృష్ణ మాదిగను అరెస్టు చేసినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, బీజేపీ అజెండా ధృతరాష్ట్ర పాలనను తలపిస్తోందని ప్రజలంతా భావిస్తుంటే.. అలాంటి పాలనే కావాలని మోత్కుపల్లి కోరుకోవడం విడ్డూరమన్నారు. మాదిగ దొరగా పేరు తెచ్చుకున్న మోత్కుపల్లి వెనక ఉండి ఆడిస్తున్న శక్తులేవో దళిత సోదరులు గమనిస్తున్నారని, వారే మోత్కుపల్లికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు, మాదిగలకు తగిన గుర్తింపు ఇవ్వని విషయం మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనే సామెత మోత్కుపల్లి లాంటి వారిని చూసే పుట్టిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తల్లిలాంటి టీడీపీ పార్టీ పట్ల కృతజ్ఞతగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి
వస్తుందని మోత్కుపల్లిని హెచ్చరించారు.
——————————–