అఫ్ఘాన్‌లో మళ్లీ పైచేయి సాధిస్తున్న తాలిబన్లు

అమెరికా దళాల ఉపసంహరణతో పట్టుబిగింపు
దేశాన్ని రక్షించుకోవాల్సింది అక్కడి సైన్యమే అన్న అమెరికా
అప్గాన్‌ విడిచి రావాలని వివిధ వర్గాలకు భారత్‌ హెచ్చరిక
కాబూల్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి): తమ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆఫ్ఘన్‌ భద్రతా బలగాలదేనని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. అఫ్గాన్‌లో దళాలను ఉపసంహరించుకున్న తరవాత అక్కడ జరుగుతున్న పరిణామాలను అమెరికా నిశితంగా గమనిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లోని పట్టణాలు, వాణిజ్య మార్గాలతో
పాటు సోమవారం తాలిబన్‌ తీవ్రవాదులు ఆరో రాజధానిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ నెల 31తో ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైనిక ఉపసంహరణ పూర్తవుతుందని అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దూత జల్మీ ఖలీల్‌జద్‌ కతార్‌ వెళ్లారని, అక్కడ ఆయన తాలిబన్లతో మాట్లాడి దాడులు నిలిపివేసి, చర్చలతో రాజకీయ పరిష్కారాన్ని కుదుర్చుకోవాలని కోరతారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు జరగనున్న చర్చల్లో ప్రభుత్వాల, బహుముఖ సంస్థల ప్రతినిధులు హింసను తగ్గించడం, కాల్పుల విరమణను అమలు చేయడంపై దృష్టి పెడతారని విదేశాంగ శాఖ పేర్కొంది. బల ప్రయోగం తో ఏర్పడే ప్రభుత్వాన్ని గుర్తించరాదన్న హావిూపై కూడా చర్చిస్తారని తెలిపింది. సోమవారం సామంగన్‌ ప్రావిన్స్‌ రాజధాని అయబక్‌ను తాలిబన్లు స్వాధీన పరుచు కున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘన్‌లో కొనసాగుతున్న హింసా ధోరణుల పట్ల అమెరికా ఆందోళన చెందుతోందని పెంటగన్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ చెప్పారు. తాలిబన్లను ఎదుర్కొనే సామర్ధ్యం ఆఫ్ఘన్‌ భద్రతా బలగాలకు వుందని అన్నారు. ఇదిలావుంటే అఫ్గాన్‌లో తాజా దాడుల నేపథ్యంలో భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల హింస పెరిగిపోతున్న నేపథ్యంలో భారత పౌరులు వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విమానాల రాకపోకలు బంద్‌ కాకముందే అందరూ స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని మంగళవారం ప్రకటించింది. అఫ్ఘానిస్థాన్‌లో పనిచేస్తున్న భారత కంపెనీలు సత్వరమే తమ ఉద్యోగులను పంపించేయాలని కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయం కోరింది. అఫ్ఘాన్‌లోని అనేక ప్రాంతాలకు హింస, అల్లర్లు విస్తరించిన నేపథ్యంలో చాలా నగరాలు, ప్రదేశాలకు విమాన సేవలు నిలిచిపోయాయని దౌత్య కార్యాలయం పేర్కొంది. అఫ్ఘాన్‌ సందర్శనలో ఉన్న భారత పౌరులు, అక్కడ తాత్కాలికంగా ఉంటున్న వారు విమాన సేవలు నిలిచిపోకముందే ఇండియాకు వెళ్లి పోవాలని చెప్పింది. భారత జర్నలిస్టులకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. అఫ్ఘాన్‌లో నాలుగో అతిపెద్ద నగరం మజర్‌`ఈ`షరీఫ్‌లో ఉన్న దౌత్య కార్యాలయం నుంచి కూడా భారత్‌ సిబ్బందిని ఖాళీ చేయిస్తోంది. కాగా, అఫ్ఘాన్‌`పాకిస్థాన్‌ సరిహద్దులో తాలిబన్లకు ఆశ్రయమిస్తున్న స్థావరాలను మూసేయాలని పాక్‌తో అమెరికా చర్చలు జరుపుతోందని పెంటగాన్‌ పేర్కొంది.