హైడ్రా మరో విజయం

` మియాపూర్‌లో భారీ ఆపరేషన్‌
` రూ.3వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాధీనం
హైదరాబాద్‌(జనంసాక్షి):మియాపూర్‌లో హైడ్రా శనివారం భారీ ఆపరేషన్‌ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ విలేజ్‌ మక్తా మహబూబ్‌ పేట సర్వే నంబరు 44లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 3 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇదే సర్వే నంబరు 44లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి అవుతోందని హైడ్రాకు గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు గతేడాది డిసెంబరు 8వ తేదీన 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను తొలగించింది. మియాపూర్‌ ` బాచుపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని 200ల విూటర్ల మేర ఉన్న 18 షెట్టర్లను హైడ్రా గతంలోనే తొలగించింది. తాజాగా అదే సర్వే నంబరు 44లో 15 ఎకరాలను శనివారం స్వాధీనం చేసుకుంది. రేకులతో హద్దులను నిర్ణయించి ఆక్రమణలకు పాల్పడగా.. వాటిని తొలగించి హైడ్రా ఫెన్సింగ్‌ వేసింది. సర్వే నంబరు 44లోని ప్రభుత్వ భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు.. సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌ కు సంబంధించిన వార్తల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా పరిశీలించింది. ఆక్రమణలను నిర్ధారించుకుంది. హైడ్రాకమిషనర్‌ శ్రీ ఏవీ రంగనాథ్‌ గారి ఆదేశాల మేరకు శనివారం 15 ఎకరాల మేర ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్‌ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. 159 సర్వే నంబర్‌కు సంబంధించిన పత్రాలతో సర్వే నంబర్‌ 44లోని ఎకరన్నర వరకూ కబ్జా చేసిన ఇమ్రాన్‌ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదయ్యింది.