శేరిలింగంపల్లి, ఆగస్టు 26( జనంసాక్షి): భారతదేశంలోకి ఓ సామాన్య వ్యక్తిగా ప్రవేశించి అకుంఠిత దీక్షతో, అవిశ్రాంత సేవలతో ఎందరో అభాగ్యుల జీవితాలలో వెలుగుని నింపి వారి హృదయాలలో అఖండ జ్యోతిగా చిరస్థాయిగా మిగిలిపోయిన మహోన్నత వ్యక్తి మదర్ తెరిసా అని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ స్పష్టంచేశారు. ఈమేరకు మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకొని మాదాపూర్ స్వాతి హై స్కూల్ లో రాగం మల్లికార్జున యాదవ్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ రాందాస్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మానవసేవే మాధవ సేవగా భావించి, సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నటువంటి, గచ్చిబౌలి సత్యసాయి సేవా సంస్థ సభ్యులు సి. శశికిరణ్, ఎం. దీప్తి, చందన, గ్రేస్ వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్, అమ్మానాన్న వృద్ధాశ్రమం నిర్వాహకురాలు శ్రీదేవికి “సేవారత్న” పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా వారికి శాలువ కప్పి జ్ఞాపిక పగిడీని వేద మంత్ర ఆశీర్వాదాల మధ్య ఘనంగా సమర్పించారు. అనంతరం రామస్వామి యాదవ్, ప్రొఫెసర్ రాందాస్ మాట్లాడుతూ యుగోస్లేవియా దేశంలో పుట్టి భారత దేశానికి ఉపాధ్యాయురాలిగా వచ్చిన మదర్ థెరిస్సా తన అచించల సామాజిక సేవల ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపును పొంది “అమ్మ”గా అందరి హృదయాలలో మిగిలిపోయిందన్నారు. కోల్ కత్తా మురికివాడలోని అభాగ్యుల జీవితాలలో వెలుగును నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరీసాయని, తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నిసైతం త్యాగంచేసి కష్టాల్లో ఉన్నవారిని వెతికిమరీ సాయం అందించిన ప్రేమ మూర్తి అని వారు కొనియాడారు. అమ్మగా మదర్ థెరిసా సేవా తత్పరతను తన తండ్రిద్వారా పునికిపుచ్చుకున్నారని వారు గుర్తు చేశారు. కలకత్తాలోని మురికివాడల్లో దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయి, ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి, మానవ సేవకు ఆమె శ్రీకారం చుట్టారని, అనాధ పిల్లల కోసం పాఠశాలలను ఏర్పాటుచేసి వారి పోషణకు తగిననిధులు లేకపోవడంతో కోల్కత్తా నగరంలో జోలెపట్టి, అనాధ పిల్లల కడుపు నింపారని పునరుద్ఘాటించారు ఆమె సేవా నిరతిని గుర్తించిన కొందరు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఆర్థిక సాయం అందించి, ఆమెకు బాసట గా నిలిచారన్నారు. 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి ఈ సంస్థద్వారా దాదాపు 45 ఏళ్లలో ఎందరో అభాగ్యులు, పేదలు రోగులకు సేవలు అందించడం జరిగిందని, అనేక అనాధ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ ఐ వి, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి, తన సేవలద్వారా స్వాంతన చేకూర్చిన అమృతమూర్తి మదర్ థెరిసా అన్నారు. 1951లో భారత పౌరసత్వం లభించడంతో లక్షలాదిమంది ప్రజలు ప్రముఖ వ్యక్తులు ప్రభుత్వాలు అనేక సంస్థలు ఆమెను కీర్తించినప్పటికీ, విమర్శలను కూడా ఎదుర్కొని, వాటికి తన సేవద్వారా సమాధానం చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి మదర్ థెరీసా అని అన్నారు .1952లో కోల్కత్తాలో హోం ఫర్ ది డైంగ్ ని స్థాపించారు. భారత ప్రభుత్వ సహాయ సహకారాలతో పాడుబడిన దేవాలయాలన్నీ ప్రజల ధర్మశాలలుగా మార్చి, వాటికి “కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం”నిర్మల హృదయాలయాలు గా నామకరణం చేశారని అన్నారు. ఈ నిలయాలకు వచ్చేవారి జీవితం చరమాంకదశలో ఉన్నవారికి, అనాథలకు, అభాగ్యులను చేరదీసి వారికి సేవలందించి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాలు మరియు మతాచారాల ప్రకారం వారి ఖర్మకాండలను జరిపించి, గౌరవంగా చనిపోయే అవకాశాన్ని కల్పించిన మహోన్నతురాలు అనిఅన్నారు. ఆమె సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1962లో పద్మశ్రీ, జవహార్ లాల్ నెహ్రూ అవార్డులవంటి అనేక అవార్డులతోసత్కరించారు.
మదర్ థెరిసా తన సేవలను భారతదేశ వ్యాప్తంగాను మరియు ఇతర దేశాలకు విస్తరించారు. సుమారు 123 దేశాలలో 610 కేంద్రాల ద్వారా తన సేవలను అందించారు. ఆమె సేవలను గుర్తించి 1979లో నోబుల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. 1980లో భారత ప్రభుత్వం “భారతరత్న” బిరుదుతో సత్కరించింది. అని తెలిపారు. నేటి యువతీ యువకులు ఆమె యొక్క సేవా తత్పరతను ఆదర్శంగా తీసుకొని, వృద్ధులకు, సమాజంలో అభాగ్యులకు, నిరుపేదలకు, సేవలను అందించాలని కోరారు. ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకు “మానవసేవే మాధవసేవ” గా భావించి సేవాతత్పరతను అలవాటు చేయాలని వారు కోరారు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని భావించి, ఎంతోమందికి ఆదర్శంగా నిల్చిన స్ఫూర్తి ప్రదాత తెరెసా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వాతిస్కూల్ కరస్పాండెంట్ ఫణి కుమార్, సత్యసాయి సేవా సమితి సభ్యులు డా. బిసి రామన్న, డి.వి.కె రావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, శివరామకృష్ణ, ,ఉమాచంద్రశేఖర్, శ్రీదేవి, అధ్యాపకులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.