అభివృద్ది కార్యక్రమాల అమలు చంద్రబాబుకే సాధ్యం – ఎంఎల్సి శిద్ధా
దొనకొండ, జూలై 18 : రాష్ట్రంలోని ప్రజలకు అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు పరిచి అందచేసే నాయకుడు నారా చంద్రబాబునాయుడేనని తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యం అవుతుందని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎంఎల్సి శిద్ధా రాఘవరావు తెలిపారు. మండలంలో చివరిరోజు పర్యటనలో భాగంగా బుధవారం గంగదేవిపల్లి, పెద్దన్నపాలెం, దొనకొండ గ్రామ పంచాయితీల్లోని గ్రామాలలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలు శిద్ధాకు అపూర్వ స్వాగతం పలికారు. నరసింహనాయునిపల్లి గ్రామంలో దేశం పార్టీ నాయకులు నిమ్మకాయల సుబ్బారెడ్డి, పురుషోత్తం సత్యానందంల ఆధ్వర్యంలో మేళతాళాలతో బాణాసంచా కాలుస్తూ గ్రామంలో భారీగా ఊరేగింపు నిర్వహించి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎస్సీ కాలనికి చెందిన యు రంగారావును శిద్ధారాఘవరావు పరామర్శించి ఆయనకు ఐదు వేల ఆర్ధిక సహాయంను అందచేశారు. గ్రామంలోని ప్రజల కోరిక మేరకు బోరింగ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. గంగదేవిపల్లి గ్రామంలో ఒక బోరింగ్, పారిశుద్ధ్య పనుల నిమిత్తం 50వేలు మంజూరు, పెద్దగుడిపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన దేవాలయ అభివృద్ధికి ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా గ్రామాల్లోని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మండలంలో తాను నాలుగు రోజులుగా పర్యటిస్తున్నానని, అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మంచినీటి సమస్యను ప్రస్తావించారని అన్నారు. కాంగ్రెస్ పాలన అధ్వాన్నంగా ఉందని, సంక్షేమ పథకాలను విస్మరించారని, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలను చేపట్టలేదని అన్నారు. ప్రస్తుతం కరెంటు సమస్య తీవ్రమైందని గ్రామాల్లో ప్రజలు కరెంటును మరిచిపోతున్నారని, రైతులు పొలాల్లో కరెంటుకోసం పడిగాపులు కాసి ఎందరో విషపురుగుల దాడికి బలవుతున్నారని ఆరోపించారు. తన ఎంఎల్సి నిధుల నుంచి గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతుందని, అన్ని సమస్యలను శాశ్విత పరిష్కారం అందించేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు. ప్రజలు దేశం పార్టీని ఆదరించి అధికారంలోకి తేవాలని అన్నారు. అనంతరం దొనకొండలో మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన ఎగురవేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎం మల్లికార్జునశర్మ, పరిటాల సురేష్, దర్శి మండల నాయకులు శోభారాణి, జోసఫ్, మండల నాయకులు దుగ్గెంపూడి కాశయ్య షేక్ మగ్బుల్ అహ్మద్, ఎం షపీవుల్లాఖాన్; మాజీ సర్పంచి ఎం అంథోనిపీటర్, చెన్నుబోయిన సుబ్బారావు, బత్తుల గాలెయ్య, మోడి ఆంజనేయులు మరికొందరు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.