అభివృద్ది జరిగితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్‌: ఎంపి

మెదక్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా ఎలాంటి అభివృద్ధి చేయకూడదని కాంగ్రెస్‌ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు. అభివృద్ది జరిగితే పుట్టగతులు ఉండవన్నదే కాంగ్రెస్‌ కుట్రని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలించిన పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రాజెక్టులు నిర్మించలేదని విమర్శించారు. సాగు నీటికోసం తమ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఎంపి మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ నేతల తీరును ఎండగడుతూ పుస్తకాలు, కరపత్రాలు ముద్రించి ఊరూరా పంచి పెడతామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో 34 ప్రాజెక్టుల్లో ఒక్కటికూడా పూర్తి చేయలేదని, 10వేల ఎకరాలు ఉన్న ప్రాజెక్టు పూర్తిచేసి ఎకరాన్ని కూడా తడపలేక పోయారన్నారు. సిఎం కెసిఆర్‌ కేవలం 10 నెలల్లోనే భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి 58 వేల ఎకరాలకు నీరిచ్చారన్నారు. కాంగ్రెసోళ్లు మల్లన్నసాగర్‌, కాళేశ్వరం భూసేకరణను అడ్డుకున్నారని, పాలమూరు ఎత్తిపోతలపై ట్రిబ్యునల్‌కు వెళ్లారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని 80 శాతం హావిూలు నెరవేర్చామని మంత్రి తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో 500 జనాభా కలిగిన గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చనున్నట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పిచ్చివాడని టీఆర్‌ఎస్‌ ఎంపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే సంగారెడ్డి నుంచి పారదోలుతామని హెచ్చరించారు.